AP High Court: కోర్టు ధిక్కరణ కేసు.. డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావుకు మూడు నెలల జైలు శిక్ష

3 Month Jail And Rs 2000 fine to DME Raghavendra Rao
షార్ట్స్‌లో చూడండి
కోర్టు ధిక్కరణ కేసులో వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ ఎం.రాఘవేంద్రరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ. 2 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వీలుగా తీర్పు అమలును వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ గడువు లోపు అప్పీలు చేసుకోకపోయినా, వేసిన తర్వాత స్టే లభించకున్నా ఈ నెల 29న సాయంత్రం 5 గంటల్లోపు హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. అనంతరం ఆయనను జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కర్నూలు వైద్య కళాశాలలో 2018-19 సంవత్సరానికి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా లేనప్పటికీ కళాశాల నుంచి ఆ ఏడాది ముగ్గురు వైద్యులు పదోన్నతి కౌన్సెలింగులో పాల్గొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఇతర కళాశాలలకు వెళ్లేందుకు అంగీకరించారు. అయితే, అంగీకరించిన స్థానాలకు వెళ్లకుండా కర్నూలు వైద్య కళాశాలలోనే కొనసాగారు. ఆ తర్వాత అదే కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఖాళీలు ఏర్పడగా ఆ ముగ్గురినీ నియమిస్తూ 10 అక్టోబరు 2020న డీఎంఈ ఉత్తర్వులు ఇచ్చారు. 

వారి నియామకాన్ని సవాలు చేస్తూ కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయిన డాక్టర్ సి.సునీత, డాక్టర్ ఎ.సుధారాణి డిసెంబరు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. వారు పదోన్నతి పొందినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అంగీకరించిన స్థానాలకు వెళ్లలేదని, ఫలితంగా ఆ పోస్టులకు అర్హులమైన తాము నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారించిన న్యాయస్థానం డీఎంఈ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. 

అయినప్పటికీ ఆ ముగ్గురూ ఇంకా అక్కడే కొనసాగుతుండడంతో సునీత, సుధారాణి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినట్టు నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Go Back to Shorts
AP High Court
DME
Kurnool Medical College

More Telugu News