Jeevan Reddy: బీజేపీ ఎంపీ అరవింద్ ను రైతులు నిలదీయడానికి కారణం ఇదే: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy fires on D Arvind
బీజేపీ ఎంపీ అరవింద్ కారుపై ఆర్మూర్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అరవింద్ ను ఒక్క ఆర్మూర్ రైతులే కాకుండా పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులందరూ నిలదీస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి దాన్ని నిలబెట్టుకోనందుకే రైతులు నిలదీస్తున్నారని చెప్పారు.

ఆర్మూర్ లో అరవింద్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... రైతులను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీని మించిన ఉగ్రవాద పార్టీ మరేదీ లేదని విమర్శించారు. బీజేపీ ఒక ఉగ్రవాదుల కర్మాగారంలా మారిందని అన్నారు. ఉగ్రవాద స్వభావం కలిగిన వ్యక్తులు రైతులను ఉగ్రవాదులతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన 700 మంది రైతులను బీజేపీ శ్మశానానికి పంపిందని విమర్శించారు.

నిజమైన దేశ ద్రోహులు బీజేపీ నేతలేనని జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే పాకిస్థాన్, ఖలిస్థాన్ అంటూ ప్రజలను రెచ్చగొడుతుంటారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే పెట్రోల్ ధరలను పెంచడం లేదని అన్నారు. కేసీఆర్ పై బీజేపీ నేతలు వాడుతున్న భాష సరిగా లేదని... పద్ధతి మార్చుకోకపోతే టీఆర్ఎస్ సైనికులు ఊరుకోరని హెచ్చరించారు.
Jeevan Reddy
KCR
TRS
D Arvind
BJP

More Telugu News