Chandrababu: నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోంది: చంద్ర‌బాబు నాయుడు

Chandrababu slams jagan
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా నేత‌న్న‌ల ప‌రిస్థితుల గురించి ఆయ‌న వివ‌రించారు. 'పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుండి 16 శాతానికి పెంచాం. నూలుపై సబ్సిడీని 10 నుండి 40శాతానికి పెంచాం.

చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీ అమలు చేశాం. పనులు లేని వర్షాకాలానికి భృతి అందించాం. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాం. ఆదరణతో పనిముట్లు అందజేసి అండగా నిలిచాం. తెలుగుదేశం హయాంలో నాటి పరిస్థితుల్ని, వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోంది.

ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోంది. నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్థ‌కం చేస్తోంది' అని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు.

'నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలి. అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను' అని చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Andhra Pradesh

More Telugu News