Payyavula Keshav: బుగ్గన గారూ, మీరు మేధావి అని అందరికీ తెలుసు... బుర్రకథలు చెప్పొద్దు: పయ్యావుల

Payyavula Keshav fires on Buggana
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్లకు లెక్కాపత్రం లేదని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో, పయ్యావుల మరోసారి మీడియా ముందుకు వచ్చి బుగ్గనపై మండిపడ్డారు. బుగ్గన మేధావి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని, కానీ రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో ఉన్నప్పుడు హుందాగా వివరణ ఇవ్వాల్సి ఉందని హితవు పలికారు.

తాను ఈ అంశాన్ని గవర్నర్ కు నివేదించిన తర్వాత కేవలం 7 నిమిషాలే మీడియాతో మాట్లాడానని, కానీ బుగ్గన 55 నిమిషాల పాటు మాట్లాడినా ఎక్కడా దీనిపై వివరణ ఇవ్వకపోగా, రాజకీయ ఆరోపణలే చేశారని పయ్యావుల అన్నారు.

"మా ఆరోపణలపై ఎలాంటి సమాధానం ఇవ్వాలో అధికారులు ఈ నాలుగు రోజులు కసరత్తు చేసి ఇస్తే, ఇవాళ మీరు మీడియా ముందుకొచ్చారు. ఏం మీకు అందుబాటులో మీడియా లేదా? రోజూ మీరు మీడియాలో కనిపించడంలేదా? వివరణ ఇచ్చేందుకు ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? గతేడాది బ్యాంకు గ్యారంటీలపై వివరణ కోరితే ఏడాది తర్వాత బదులిచ్చారు. ఇదేనా ప్రజాపద్దుల కమిటీకి మీరిచ్చే గౌరవం?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ప్రభుత్వ రుణాల గురించి మాట్లాడుతూ, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రూ.25 వేల కోట్ల రుణం కోసం బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారని ఆరోపించారు. వీళ్ల మాటల్లో ఒక్కటి కూడా నిజంలేదని, జీవోల్లో ఒకటి చెబుతారని, కోర్టుకెళ్లి మరొకటి చెబుతారని, అసెంబ్లీలో ప్రస్తావించకుండా దాస్తారని విమర్శించారు. అసలు, బ్యాంకులో మీరేమని సంతకం పెట్టారని నిలదీశారు.

"రూ.25 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలపై రాష్ట్ర శాసనసభకు తెలియకుండా ఎందుకు దాచారు? దీనికి మీరేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దీనికి మిమ్మల్ని వివరణ అడిగితే చెప్పరు... గవర్నర్ ను మేం కలిస్తే తప్పయిపోయిందా? మేం ఢిల్లీ వెళితే మీకెందుకు బాధ?... అసలు ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది ఎవరు?" అంటూ పయ్యావుల వ్యాఖ్యానించారు.

బుగ్గన ఇకనైనా బుర్రకథలు చెప్పడం మానాలని, అవి బుగ్గన కథలుగా మిగిలిపోతాయని అన్నారు. బుగ్గన వాస్తవాలను ఇప్పటికైనా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "రుణాలకు సంబంధించి మేం ఏది నమ్మాలి? మీరిచ్చిన జీవోను నమ్మాలా? మీ ఏజీ గారు కోర్టుకు చెప్పింది నమ్మాలా? లేక, శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా? లేక, అసలు బ్యాంకుకు ఏమిచ్చారో అది కనుక్కోవాలా?... దీనిపై వాస్తవాలు విడుదల చేయండి" అంటూ డిమాండ్ చేశారు. తమకు జవాబివ్వకపోయినా, ప్రజలముందైనా ఉంచండి అని స్పష్టం చేశారు. 'మీరు దోచుకున్నారని నేను అనడంలేదు, ఎందుకు దాచారని అడుగుతున్నాను' అంటూ పయ్యావుల ప్రశ్నించారు.
Go Back to Shorts
Payyavula Keshav
Buggana Rajendranath
Debts
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News