విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని కేపీ ఓలి
- కేపీ ఓలికి మద్దతు ఉపసంహరించిన అధికార పక్షం
- పార్లమెంటులో నేడు విశ్వాస పరీక్ష
- అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 మంది
- రాష్ట్రపతికి రాజీనామా సమర్పించనున్న కేపీ ఓలి
- త్వరలో నేపాల్ లో కొత్త ప్రభుత్వం
2015లో నేపాల్ లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఓ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ఇదే ప్రథమం. కాగా, బలపరీక్షలో ఓటమి నేపథ్యంలో ప్రధాని కేపీ ఓలి తన రాజీనామాను రాష్ట్రపతి బిద్యాదేవి బండారీకి సమర్పించనున్నారు. ఆపై, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి పార్లమెంటును ఆదేశిస్తారు.
ప్రధాని కేపీ ఓలిపై అవిశ్వాస మేఘాలు ఎప్పటినుంచో అలముకుని ఉన్నాయి. తాజాగా ప్రచండ ఆధ్వర్యంలోని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీనే కేపీ ఓలికి మద్దతు వెనక్కి తీసుకుంది. దాంతో పార్లమెంటులో విశ్వాస పరీక్ష నిర్వహించారు. పార్లమెంటులో ఇతర పార్టీల మద్దతుతో గండం గట్టెక్కగలనని కేపీ ఓలి విశ్వాస పరీక్షకు ముందు ధీమా వ్యక్తం చేశారు. కానీ, సభలో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది.