'అమ్మ ఒడి' బదులు ల్యాప్ టాప్ ఇస్తాం... లబ్దిదారులకు వైఎస్ జగన్ లేఖ!

Laptops insted of Amma Vodi Cash Jagan Writes a Letter to Mothers
  • రూ. 25 వేలకు పైగా విలువైన ల్యాప్ టాప్
  • పిల్లలకు మేనమామగా ఇస్తాను
  • వద్దనుకుంటే తల్లుల ఖాతాల్లో డబ్బు
రానున్న 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి లబ్దిదారులైన మహిళలు కోరుకుంటే, 9 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థులకు నగదు బదులుగా ల్యాప్ టాప్ లను ఇస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆయా లబ్ధిదారులకు లేఖలు రాశారు.

ఈ ల్యాప్ టాప్ లలో డ్యూయల్ కోర్ కు సమానమైన ప్రాసెసర్ తో పాటు 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్ ఉంటుందని, మార్కెట్లో దీని విలువ రూ. 25 వేల నుంచి రూ. 27 వేల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. 3 సంవత్సరాల వారంటీ ఉంటుందని, 7 రోజుల్లోనే రీప్లేస్ మెంట్ లేదా రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఇక సీఎం రాసిన లేఖ ప్రతి కాపీని 9వ తరగతి పైన చదువుతున్న విద్యార్థుల తల్లులకు పంపించి, వారి అభిప్రాయం తెలుసుకుని ల్యాప్ టాప్ లను అందించాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఏప్రిల్ 10లోపు లేఖలను తల్లులకు పంపాలని, ఈ లేఖలోని అంశాలను వివరించి, వారి అభీష్టాన్ని రికార్డు చేయాలని, తిరిగి సమాధానంతో కూడిన లేఖలను 22వ తేదీలోగా స్కూల్ ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు అందించాలని అధికారులు ఆదేశించారు.

ఇక జగన్ రాసిన లేఖలో కోరుకుంటేనే ల్యాప్ టాప్ ఇస్తామని, లేకుంటే ఇస్తామన్న నగదును బ్యాంకు ఖాతాలో వేస్తామని జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆన్ లైన్ లో పాఠాలను వినవచ్చని, చదువుకు సంబంధించిన వీడియోలను చూడటంతో పాటు, డిజిటల్ బుక్స్ చదువుకోవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని వెతక వచ్చని, ఈ-మెయిల్స్ సౌకర్యం ఉటుందని, వివిధ రకాల ప్రోగ్రాములతో ప్రాజెక్టు పనులను చేసుకోవచ్చని అన్నారు. హానికర వెబ్ సైట్ల నిరోధానికి, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసి ఇస్తామని అన్నారు. మారుతున్న ప్రపంచంలో పిల్లలు వెనుకబడకుండా ఉండకుండా చూసేందుకు పిల్లలకు మేనమామ హోదాలో ఈ సూచన చేస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Laptop
Amma Vodi
Jagan
Letter

More Telugu News