Indian Prisoners: ప్రపంచ జైళ్లలోని భారతీయుల్లో సగం మంది గల్ఫ్​ దేశాల్లోనే

  • 82 దేశాల్లో 8 వేల మంది భారత ఖైదీలు
  • ఆరు గల్ఫ్ దేశాలు, ఇరాన్ లోనే 4,058 మంది
  • మన ఏడు పొరుగు దేశాల జైళ్లలో 1,913 మంది
  • నేపాల్ లో 886.. పాక్ లో 524 మంది ఖైదీలు
  • పార్లమెంట్ లో వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ
Nearly 8000 Indian prisoners lodged in foreign jails most in Saudi Arabia

బ్రోకర్ల మాయమాటలు నమ్మి ఉన్న డబ్బులన్నీ వారి చేతుల్లో పోసి.. గల్ఫ్ దేశాలకు వెళుతున్న భారతీయులు జైలు పాలవుతున్నారు. అక్కడ యజమానులు పెట్టే బాధల్ని పంటి కింద భరిస్తూనే బతికేస్తున్నారు. వారు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన గణాంకాలే చెబుతాయి. పార్లమెంట్ లో విదేశాల్లోని భారతీయ ఖైదీల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా 82 దేశాల్లో 8 వేల మంది భారతీయులు జైలు పాలైతే.. అందులో సగం మందికిపైగా ఆరు గల్ఫ్ దేశాలు, ఇరాన్ లోనే ఉన్నారని పేర్కొంది. 4,058 మంది భారతీయ ఖైదీలు గల్ఫ్ దేశాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపింది. అమెరికాలో 267 మంది, బ్రిటన్ లో 373 మంది భారతీయ ఖైదీలున్నట్టు చెప్పింది. మొత్తం 11 దేశాల్లో వంద మంది చొప్పున భారతీయులు ఖైదీలుగా ఉన్నారంది.

విచారణ ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా సౌదీ అరేబియాలోనే ఉన్నట్టు తెలిపింది. ఆ దేశంలో దాదాపు 1,570 మంది భారతీయ ఖైదీలు విచారణ ఎదుర్కొంటున్నారని కేంద్రం తెలిపింది. తర్వాత యూఏఈలో 1,292, కువైట్ లో 439, ఖతార్ 178, బహ్రెయిన్ 70, ఇరాన్ , ఒమన్ లలో 49 మంది చొప్పున విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

భారత్ కు పొరుగున ఉన్న ఏడు దేశాల్లో 1,913 మంది భారతీయ ఖైదీలున్నారని కేంద్రం పేర్కొంది. అందులో అత్యధికంగా నేపాల్ లో 886 మంది ఉన్నట్టు చెప్పింది. పాకిస్థాన్ లో 524, చైనాలో 157, బంగ్లాదేశ్ 123, భూటాన్ 91, శ్రీలంకలో 67, మయన్మార్ లో 65 మంది ఉన్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ లో మాత్రం ఒక్క భారతీయ ఖైదీ కూడా లేడని కేంద్రం చెప్పింది.

ఇక, సింగపూర్ , మలేసియాలు కలిపి 480 మంది భారతీయులను జైల్లో పెట్టాయని, ఫిలిప్పీన్స్ లో 41 మంది భారతీయ ఖైదీలున్నారని తెలిపింది. థాయ్ ల్యాండ్ లో 23, ఇండోనేసియాలో 20, ఆస్ట్రేలియాలో 62, కెనడా, సిప్రస్ లలో 23 మంది చొప్పున, ఫ్రాన్స్ లో 35, గ్రీస్ లో 22, మాల్దీవ్స్ లో 24, స్పెయిన్ జైళ్లలో 49 మంది ఉన్నారని పేర్కొంది. ఇప్పటిదాకా రీప్యాట్రియేషన్ (తిరిగి అప్పగించడం)లో భాగంగా 81 మంది ఖైదీలను వివిధ దేశాలు అప్పగించాయని తెలిపింది.

స్థానిక చట్టాలను ఉల్లంఘించిన కేసుల్లోనే ఎక్కువగా భారతీయులను వివిధ దేశాలు జైల్లో పెడుతున్నాయని, వాటన్నింటినీ గమనిస్తూనే ఉన్నామని చెప్పింది. వారికి కావాల్సిన సాయాన్ని అన్నివిధాలా అందిస్తున్నామని వివరించింది. వివిధ దేశాల్లో భారత కాన్సులేట్లు, దౌత్య కార్యాలయాలు సాయం చేస్తున్నాయని, అవసరమైన చోటల్లా న్యాయవాదులతో స్థానికంగా ఓ గ్రూపును ఏర్పాటు చేశామని విదేశాంగ తెలిపింది.

More Telugu News