Vakeel Saab: వ‌కీల్ సాబ్, ఖిలాడి సినిమాల‌ విడుదల తేదీలు ఖ‌రారు.. కొత్త పోస్ట‌ర్ల విడుద‌ల‌

  • వ‌కీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల
  • మే 28న రవితేజ ఖిలాడి రిలీజ్
  • కొత్త పోస్ట‌ర్ల‌తో అల‌రించిన ప‌వ‌న్, ర‌వితేజ‌
PawanKalyans VakeelSaab in theatres from April 9 2021

టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఈ వేస‌వి కాలం అంతా పెద్ద పండుగ‌ను చేసుకోబోతున్నారు. వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ‌కీల్ సాబ్‌, ర‌వితేజ ఖిలాడి సినిమాల విడుద‌ల తేదీల‌ను ఆయా సినిమా యూనిట్లు ప్ర‌కటించాయి.

దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వ‌కీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా న‌టిస్తోంది. అంతేగాక‌, ఇందులో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల ప్ర‌ధాన‌ పాత్రల్లో క‌న‌ప‌డ‌నున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కొత్త‌ పోస్టర్‌లో ఎర్ర కండువా, ర‌క్త‌పు మ‌ర‌కల‌ చొక్కాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌న‌ప‌డుతూ త‌న ఉగ్ర‌రూపాన్ని చూపాడు.

మ‌రోవైపు, టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవ‌లే ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. దర్శకుడు రమేశ్‌ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల తేదీ ఖరారైంది. మే 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని ర‌వితేజ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఈ సినిమాకు‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపుదిద్దుకుంటోంది. విడుద‌ల తేదీ ఖ‌రారు సంద‌ర్భంగా మాస్ మ‌హారాజా పోస్ట‌ర్ ను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. న‌ల్ల రంగు కోటులో , చేతిలో తుపాకీతో ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు.

More Telugu News