Chittoor District: ప్రియురాలిని పొడిచి చంపిన ఢిల్లీబాబు ఆత్మహత్య.. తూర్పుపల్లి అడవిలో మృతదేహం గుర్తింపు

Man Who Murdered His Lover Suicided
షార్ట్స్‌లో చూడండి
తల్లిదండ్రుల మాటలతో తనకు దూరమైందన్న కసితో ప్రియురాలు గాయత్రిని పొడిచి చంపిన చిత్తూరు జిల్లా యువకుడు ఢిల్లీబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం తూర్పుపల్లి అడవిలో ఢిల్లీబాబు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన వివరాలలోకి వెళితే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన గాయత్రి (20), పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన ఢిల్లీ బాబు (19) మధ్య డిగ్రీ చదువుతున్నప్పుడు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరని భావించి గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన గాయత్రి తండ్రి షణ్ముగరెడ్డి తన కుమార్తె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ గుర్తించిన పోలీసులు గ్రామానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తిరిగి తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు అంగీకరించిన గాయత్రి వారితో వెళ్లిపోయింది.

తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న గాయత్రి తనను దూరం పెట్టిందన్న కసితో రగిలిపోయిన ఢిల్లీ బాబు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. గాయత్రి నిన్న సరుకుల కోసం స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై పెనుమూరుకు వచ్చింది. విషయం తెలిసిన ఢిల్లీబాబు వారు తిరిగి వెళ్తున్న సమయంలో ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీప్రాంతంలో అడ్డుకున్నాడు.

గాయత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో మొదట గొంతులో పొడిచాడు. ఆ కత్తి వంగిపోవడంతో మరో కత్తి తీసి పొట్టలో పదిసార్లు విచక్షణ రహితంగా పొడిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితురాలిని కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తన ఫోన్ ద్వారా బంధువులకు విషయం చెప్పింది. అదే సమయంలో ఆ దారివెంట ఓ వ్యక్తి రావడంతో గమనించిన ఢిల్లీ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపుమడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తొలుత పెనుమూరు పీహెచ్‌సీకి, ఆ తర్వాత వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలిసిన బాధిత యువతి బంధువులు ఆగ్రహంతో నిందితుడి ఊరైన చింతమాకులపల్లె వెళ్లి ఇంటికి నిప్పు పెట్టారు. ఢిల్లీబాబు తండ్రిని బంధించి దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది.
Go Back to Shorts
Chittoor District
Delhibabu
suicide
Love
Andhra Pradesh
Crime News

More Telugu News