రాజస్థాన్ రాజకీయాల్లో సర్ ప్రయిజ్... చిదంబరాన్ని సంప్రదించిన సచిన్ పైలట్!
- నిన్న చిదంబరానికి సచిన్ పైలట్ ఫోన్
- అవకాశాన్ని వినియోగించుకోవాలని చిదంబరం సలహా
- నేడు హైకోర్టులో విచారణకు డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్
సచిన్ తనతో మాట్లాడిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన చిదంబరం, "కాంగ్రెస్ నాయకత్వం తనని బహిరంగంగా చర్చలకు పిలిచిన విషయాన్ని సచిన్ కు మళ్లీ చెప్పాను. అక్కడ అన్ని విషయాలను చర్చించవచ్చు, వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతనికి సలహా ఇచ్చాను" అని అన్నారు. ఇదిలావుండగా, సచిన్ ను తిరిగి గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోందని, ఎప్పుడు వెనక్కు రావాలన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాల్సి వుందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి.
కాగా, హైకోర్టులో పైలట్ తరఫు న్యాయవాదులు వాయిదాను కోరితే తాము నిరాకరించబోమని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. విచారణ రెండు, మూడు రోజులు ఆలస్యం కావడమన్నది సర్వసాధారణమని అభిప్రాయపడ్డ ఓ సీనియర్ నేత, ఈ మూడు రోజుల్లో ఎంఎల్ఏలు వెనక్కు వస్తే, డిస్ క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ను తాము వెనక్కు తీసుకుంటామని తెలిపారు.