Lockdown: లాక్ డౌన్ 4.0 సరికొత్త మార్గదర్శకాలు ఇవిగో!

  • ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు
  • మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
  • రవాణాకు అనుమతి
Centre issues new set of guidelines

దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ఎంతో ఉపయుక్తం అని భావిస్తున్న కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు అమలు చేస్తున్నట్టు కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ మేరకు సడలింపులతో కూడిన నూతన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

మార్గదర్శకాలు

  • ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర రవాణా (బస్సులు, ఇతర వాహనాలు) జరుపుకోవచ్చు.
  • రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు (బస్సులు, ఇతర వాహనాలు)నిర్వహించుకోవచ్చు.
  • అన్ని రాష్ట్రాలు సరుకు రవాణా వాహనాలను అనుమతించాలి. 
  • కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం  నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
  • సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.
  • క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.
  • సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుమికూడడాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
  • అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.
  • రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
  • దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.
  • మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
  • స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
  • ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు.
  • హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. అయితే హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చు.
  • బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి. 
  • ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.

More Telugu News