ప్రిన్స్ చార్లెస్ కు ఆయుర్వేదంతోనే కరోనా నయమైంది.. ఇది వాస్తవం!: కేంద్ర మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌

08-04-2020 Wed 10:20
  • త్వరలోనే చికిత్స అందుబాటులోకి వస్తుంది
  • శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడితే వైరస్‌ తోకముడుస్తుంది
  • ఆయుర్వేదానికి ఓ లాబీ అడ్డుపడుతోంది 
ayurveda is best medicine for corona

కరోనా కష్టకాలంలో మన ప్రాచీన భారతీయ వైద్యవిధానం ‘ఆయుర్వేదమే’ మనకు శ్రీరామరక్షని  కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ అన్నారు. ప్రస్తుతం శాస్త్రీయ మదింపు జరుగుతోందని, త్వరలోనే ఆయుర్వేద వైద్య చికిత్స అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఓ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేదంతో కోవిడ్‌19ను పూర్తిగా అదుపు చేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై కరోనా దాడి చేస్తుందని, ఆ రోగ నిరోధక శక్తినే పెంచుకుంటే కరోనా తోకముడుస్తుందని మంత్రి అన్నారు.

మన శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిన్నా దాన్ని బాగు చేసుకునే పరిష్కారం మన ఆయుర్వేదంలో ఉందని మంత్రి తెలిపారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీలో అందుబాటులో ఉన్న చిట్కాలతో మన దేశంలో కరోనాను 60 నుంచి 70 శాతం వరకు నివారించవచ్చునని చెప్పారు. అయితే ఆయుర్వేదం వాడకుండా ఓ వర్గం లాబీ అడ్డుపడుతోందని మంత్రి ఆరోపించారు.

‘బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ కరోనా బారిన పడినప్పటికీ ఆయనకు ఆయుర్వేదంతోనే నయమయ్యింది. ఇది నూటొక్క శాతం నిజం. కానీ పశ్చిమదేశాలు ఆయుర్వేదాన్ని అంగీకరించే పరిస్థితి లేనందున రాజ కుటుంబం దీన్ని తోసిపుచ్చింది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.