నా కూతురిని చంపిందెవరో ఎమ్మెల్యే రోజాకు తెలుసు: ఆయేషా మీరా తల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కూతురిని చంపిందెవరో ఎమ్మెల్యే రోజాకు తెలుసు: ఆయేషా మీరా తల్లి

  • ఆయేషా హత్యకు గురైన తర్వాత రోజా చాలా హడావుడి చేశారు
  • నేరస్తుల గురించి రోజా ఎందుకు మాట్లాడటం లేదు
  • నాయకులు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలు
2007లో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా మృత దేహానికి కాసేపట్లో మరోసారి రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికకు సీబీఐ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు. తన కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేశారని... నేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. నేరస్తుల గురించి గతంలో తాను ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని... తమ వద్ద కోటి పైసలు కూడా లేవని... ఎలాంటి దావా అయినా వేసుకోవచ్చని అన్నారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తే... ఎవరు కోటి రూపాయలు చెల్లించాలో, ఎవరు శిక్ష అనుభవించాలో తెలుస్తుందని చెప్పారు.

న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని శంషాద్ బేగం తెలిపారు. మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని చెప్పారు. 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ కేసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయేషా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.
Ayesha Meera
Mother
Roja
YSRCP

More Telugu News