‘ఆర్టికల్ 370 రద్దు’.. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- అమిత్ షా పేరు పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోతుంది
- దీనంతటికీ కాంగ్రెస్ పార్టీయే కారణం
- ఆర్టికల్ 370పై విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
‘పాక్ భూభాగంలోకి 25 కిలోమీటర్ల మేర దూసుకెళ్లిన భారత ఆర్మీని అప్పటి ప్రధాని జవహల్ లాల్ నెహ్రూ వెనక్కి పిలిచింది నిజం కాదా? అప్పుడు భారత సైన్యాన్ని వెనక్కి పిలవకుంటే ఈ రోజు ఈ విషయమై మనం చర్చించేవాళ్లమే కాదు. భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్ కు కశ్మీర్ విలీనం బాధ్యతలను ఇచ్చుంటే ఈ సమస్య అప్పుడే పరిష్కారమయ్యేది. భారత్ లో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండటం ఎలా సాధ్యం?
జాతీయ జెండాలను తగలబెడితే నేరం కాకపోవడం కేవలం జమ్మూకశ్మీర్ లోనే సాధ్యమవుతుంది. కేవలం కశ్మీరీ యువతిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఓ పాకిస్థానీ పౌరుడు భారతీయుడు ఎలా అవుతాడు? భారత్ లోని ఇతర రాష్ట్రాలకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే కశ్మీరీ అమ్మాయిలు ఆస్తి హక్కులు, తమ పిల్లల ఆస్తి హక్కులు కోల్పోవడం ఏంటి? అదే కశ్మీరీ అబ్బాయి ఇతర రాష్ట్రాల యువతులను పెళ్లి చేసుకుంటే ఆస్తి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకపోవడం ఏంటి? ఇది లింగ వివక్ష కాదా? ఇవన్నీ జమ్మూకశ్మీర్ లోనే జరుగుతున్నాయి’ అని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు.