Anantapur District: తాడిపత్రిలో టెన్షన్. టెన్షన్.. పెట్రోల్ బాంబులు విసురుకున్న ఇరువర్గాలు!

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా చిన్నపొడమల గ్రామస్తులకు, ప్రబోధానంద స్వామి వర్గీయులకు మధ్య జరిగిన ఘర్షణ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలు ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. గ్రామస్తులకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మద్దతుగా నిలవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

ఈ ఘర్షణల్లో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అధికారులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జేసీ దివాకర్ రెడ్డి.. నిందితులను అరెస్ట్ చేయాలంటూ తాడిపత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి చేయిదాటుతూ ఉండటంతో జిల్లా అదనపు ఎస్పీ, ఆర్డీవో అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ ప్రకటించారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని చిన్నపొడమల గ్రామస్తులను ప్రబోధానంద స్వామి వర్గీయులు నిన్న హెచ్చరించారు. దీనికి గ్రామస్తులు కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నపొడమలకు చేరుకున్న జేసీ గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. ఆశ్రమ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Anantapur District
jc divakar reddy

More Telugu News