Actor: నా సినీ ప్రయాణం అంతా రిస్కులతోనే సాగింది: నాగార్జున

షార్ట్స్‌లో చూడండి
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నటుడు నాగార్జున నటించిన ‘ఆఫీసర్’ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి నాగార్జున ముచ్చటిస్తూ పలు విషయాలు వెల్లడించారు. ‘ఆఫీసర్’లోని తండ్రీ కూతుళ్ల ఎమోషన్ తనను కట్టి పడేసిందని, సినిమా అంగీకరించడానికి అదే కారణమని పేర్కొన్నారు. వర్మ సినిమాలు బాగా తీస్తాడని, ముక్కు సూటితనం, నిజాయతీ, వ్యవస్థపై గౌరవం ఉండే శివాజీరావు అనే పోలీస్ ఆఫీసర్ కథ ఇది అని వివరించారు. సినిమా విషయంలో వర్మకు ఎటువంటి షరతులు విధించలేదని, కాకపోతే తనలోని నైపుణ్యాలన్నింటినీ వాడుకోమన్నానని చెప్పానని, అది షరతు కాదని అన్నారు.

ఇక తన సినీ ప్రయాణం అంతా రిస్కులతో సాగిందని, ప్రతి సినిమాకు టెన్షన్ ఉంటుందన్న నాగ్.. దానిని వదిలించుకోకపోతే జుట్టు ఊడిపోతుందని చమత్కరించారు. విజయాల్లేని వర్మకు స్టార్ హీరోలు డేట్లు ఇవ్వడానికి భయపడుతుంటే మీరెలా నమ్మి, ఇచ్చారన్న ప్రశ్నకు నాగార్జున పై విధంగా సమాధానం చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ కథ విన్నానని, ఆ సినిమాను చేయమని ధనుష్ అడుగుతున్నాడని తెలిపారు. నిజానికి దానిని రజనీకాంత్‌ కోసం రాసుకున్నానని, రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండడంతో తనతో చేద్దామని అనుకున్నానని ధనుష్ చెప్పాడని వివరించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకే భరోసా లేదని, ఇక వారి పిల్లలకు ఎక్కడుంటుందని, ఎవరైనా కష్టపడాల్సిందేనని నాగ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Actor
Nagarjuna
Tollywood
Officer
RGV

More Telugu News