Chandrababu: ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు.. మోదీని అరెస్ట్ చేయిస్తానన్నారు!: సోము వీర్రాజు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
నిన్న అలిపిరి వద్ద అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు శాంతి వచనాలు పలుకుతున్నారని... కానీ అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది వేరని అన్నారు. చంద్రబాబు చేపట్టిన ధర్మ దీక్ష సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని... ఆ సందర్భంలో చంద్రబాబు ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ఆయన నవ్వును చూస్తుంటే... ప్రస్తుతం జరుగుతున్న ప్రతి ఘటన వెనక చంద్రబాబు హస్తం ఉందనే విషయం అర్థమవుతోందని అన్నారు.

ప్రధానిపై బాలకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి ఒక్క కేసు అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. నిన్న రాళ్లు విసిరిన ఘటనలో కూడా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరికి ఇదే నిదర్శనమని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు ఎక్కువయ్యాయని, ఎక్కడపడితే అక్కడ కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. తన ఇంటిపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని... తమను చూసి సోము వీర్రాజు పారిపోయాడని ఆ కార్యకర్తలు చంద్రబాబుతోనే చెప్పారని... ఇంతకంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి ఏమిటో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడిపైనే దాడి చేయడం టీడీపీ ప్రభుత్వ నైజాన్ని చాటుతోందని విమర్శించారు.

ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారని, మోదీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తానని చెప్పారని... చంద్రబాబు నాయకత్వం ఇలాగే ఉంటుందని సోము వీర్రాజు మండిపడ్డారు. మోదీపై నిరసన వ్యక్తం చేసే అర్హత టీడీపీకి లేదని అన్నారు. ప్రత్యేక హోదాతో ప్యాకేజీ కంటే ఎక్కువ ఏమొస్తుందని ప్రశ్నించారు. ఏపీకి నిధులు ఇవ్వబోమని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.  
Go Back to Shorts
Chandrababu
ntr
amit shah
Narendra Modi
somu veerraju

More Telugu News