‘కాళేశ్వరం’ పనులపై మంత్రి హరీష్ రావు సంతృప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘కాళేశ్వరం’ పనులపై మంత్రి హరీష్ రావు సంతృప్తి

  • ముగిసిన రెండు రోజుల పర్యటన
  • ఎడతెరిపి లేకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్ష సమావేశాలు
  • ‘కాళేశ్వరం’ను ఇరవై నెలల్లో పూర్తి చేస్తాం: హరీష్ రావు
కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఈరోజు రాత్రి ముగిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర గవర్నర్ వెంట పర్యటించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్ష సమావేశాలు జరిపారు. శనివారం రాత్రి కాళేశ్వరం ప్యాకేజి 6, 7, 8 పనులను ముఖ్యంగా టన్నెల్ తవ్వకాలను పరిశీలించి వాటి పురోగతిని అక్కడే సైటులో సమీక్షించారు.

ఆదివారం ఉదయం గోలివాడ, సుందిళ్ళ, అన్నారం పంపు హౌజ్ ల పనుల పురోగతిని సమీక్షించారు. ఆదివారం సాయంత్రం కన్నెపల్లి పంపు హౌజ్ దగ్గర కాళేశ్వరం పనులపై ఇరిగేషన్ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును ఇరవై నెలల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. అత్యంత వేగంగా అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యపడిందని అన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి సుందిళ్ళ, అన్నారం ఆనకట్టలను పూర్తి చేయడానికి పట్టుదలతో పని చేస్తున్నట్లు తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీని 2018 చివరి నాటికి పూర్తి చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పారు. రోజుకు రెండున్నర లక్షల సిమెంటు బస్తాలు వాడుతున్నట్టు మంత్రి చెప్పారు. కన్నేపల్లి - అన్నారం ఆప్రోచ్ కాలువ పనులను ఆయన పరిశీలించారు. వచ్చే మే నెలకల్లా ఈ కెనాల్ ను పూర్తి చేయాలని ఏజెన్సీ ని ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 125 కిలోమీటర్ల మేర నదిలో 365 రోజుల మేర నీరు నిల్వ ఉంటుందని అన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డ ఆనకట్టలపై జాతీయ రహదారుల ప్రమాణాలతో రోడ్ బ్రిడ్జ్ లు నిర్మిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు.

భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పంట పొలాలకు నీరిచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రతి ఎకరానికి సాగు నీరందుతుందని చెప్పారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రెండో దశ అటవీ అనుమతులు వచ్చినందున ఈ పథకం త్వరగా పూర్తి చేసి రెండు పంటలకు నీరివ్వాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో పెద్దపల్లి జిల్లా మంథని రూపు రేఖలు మారనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందని, నౌకాయానం అభివృద్ధి జరుగుతుందని, చిన్న కాళేశ్వరం లిఫ్టు తో మంథని లో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు.
Telangana
kcr
Harish Rao

More Telugu News