తెలంగాణను 'మేమే తెచ్చాం' అంటున్నారు.. అందరం కలసి కొట్లాడితేనే వచ్చింది!: ప్రొ.కోదండరామ్
- అందరం కలిసి సాధించుకున్నాం
- తెలంగాణ సాధించిన వారికి కొలువులు తెచ్చుకోవడం అసాధ్యం కాదు
- అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ఏం చేస్తోంది?
- భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిస శ్రద్ధ కొలువులు ఇవ్వడంలో లేదు
హోంగార్డుల సమస్యలను కూడా తాము సర్కారుకి వివరించామని, ఎన్నో సమస్యలను వివరించామని కోదండరామ్ అన్నారు. ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. "మా పోరాటం అడ్డుకుంటే ఆగేది కాదు. ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయని అంటున్నారు. ఐటీ రంగంలోనూ తెలంగాణ వారు లేరు.. ఎంత మంది ఉన్నారు? స్థానికులకే ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయాలి.
తెలంగాణ వచ్చిన తరువాత కూడా చాలా మంది దుబాయికి వెళుతున్నారు.
అప్పు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఖాళీ కడుపుతో చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు అడుగుతున్నారు. యువత భవిష్యత్తు మీద ఆశను కోల్పోయి ఉంది, ఇది ప్రభుత్వ వైఫల్యమే. విద్యార్థులకు, యువతకు ఓ ఆశ, విశ్వాసాన్ని కల్పించడంలో సర్కారు విఫలమైంది. ఖాళీ కడుపులతో ఉద్యోగాల కోసం ఆశ పెట్టుకుని చదువుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిన శ్రద్ధ కొలువులు ఇవ్వడంలో చూపడం లేదు. మమ్మల్ని రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటువంటి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది.. ఓట్లేసి గెలిపించారు.. ముఖ్యమంత్రి మంత్రులకు కూడా దొరకడం లేదు.. ఇక మనకేం దొరుకుతాడు.. వినడు, చూడడు. అసలు సచివాలయానికి కూడా సరిగ్గా రాడు.. కాంట్రాక్టులు, కమిషన్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది" అంటూ కోదండరామ్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.