మందుబాబులకు శుభవార్త... బీఏసీ కౌంట్ 30 నుంచి 100కు పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
- కఠిన నిబంధనలను సవరించాలన్న ఆలోచన
- కౌన్సెలింగ్ కు హాజరు కాని వేల మంది
- నిబంధనల మార్పుపై త్వరలో నిర్ణయం
- ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్
ప్రస్తుతం 100 ఎంఎల్ బ్లడ్ లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్ లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ కు వివాహితుడైతే భార్యను, పెళ్లికాకుంటే తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా దగ్గరి బంధువును కూడా తీసుకురావడం తప్పనిసరి కాగా, వాహనాలను వదిలేసుకుంటున్న మందుబాబులు, కౌన్సెలింగ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలా స్టేషన్లలో పేరుకుపోయిన వాహనాల సంఖ్య 3,760కి చేరింది. దీంతో బీఏసీ కౌంట్ ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు రంగనాథ్ వెల్లడించారు.
కాగా, 60 ఎంఎల్ మద్యం సేవిస్తే శరీరంలో 30 బీఏసీ నమోదవుతుంది. ఆపై ఓ అరగంట ఎక్కడైనా గడిపి వాహనం నడుపుతూ వెళ్లి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినా, ఆ పాటికి బీఏసీ తగ్గిపోతుంది. ఇక 30 బీఏసీ కౌంట్ ను 100కు సవరిస్తే, నిరభ్యంతరంగా ఓ క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేసుకుంటూ మందుబాబులు వెళ్లిపోవచ్చు.