శ్రీ రాఘవేంద్ర స్వామి క్షేత్రం

శ్రీ రాఘవేంద్ర స్వామి క్షేత్రం
రాఘవేంద్రస్వామి పేరు వినగానే మనసులోని ఆవేదన మటుమాయమవుతుంది. ఆ స్థానంలో ప్రశాంతత అలుముకుంటుంది. రాఘవేంద్రస్వామి జీవితంలోకి ఒకసారి తొంగిచూస్తే, పవిత్రతకు ... ప్రశాంతతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత గురించి తెలుస్తుంది. అహంకారానికి ఎంత దూరంగా ఉండాలో ... ఆధ్యాత్మికతకు ఎంత దగ్గరగా ఉండాలనే విషయంపై ఆయన ఇచ్చిన సందేశం భోదపడుతుంది.

ఆదర్శవంతమైన ఆశ్రమ జీవితాన్ని కొనసాగించిన రాఘవేంద్రస్వామి, భక్తిభావ పరిమళాలను వెదజల్లడం కోసం అనేక ప్రాంతాలను దర్శించాడు. ఈ నేపథ్యంలోనే తనని నమ్ముకున్న వారిని అనుగ్రహిస్తూ స్వామివారు అనేక మందిని ఆపదల నుంచి గట్టెక్కించాడు. ఈ కారణంగానే స్వామివారు అశేష భక్త జనకోటిచే ఆరాధించబడుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల్లో స్వామివారికి ఆలయాలు నిర్మించారు. ఆ కోవలోనిదే హైదరాబాద్ - బర్కత్ పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం'. 1978లో భక్తుల సహాయసహకారాలతో నిర్మించబడిన ఈ ఆలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతిరూపంగా విలసిల్లుతుంటుంది.

అందంగా తీర్చిదిద్దబడిన ముఖమంతపంలోకి ప్రవేశించిన భక్తులకు, వేదికపై 'బృందావనం' దర్శనమిస్తూ వుంటుంది. ఆలయ ప్రాకారాలపై రాఘవేంద్రస్వామి ఆధ్యాత్మిక జీవితంలోని ముఖ్యఘట్టాలు చిత్రమలికలుగా దర్శనమిస్తూ వుంటాయి. ప్రతి గురువారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అక్షరాభ్యాసాలు ... సత్యారాయణ స్వామి వ్రతాలు ... ఇక్కడ ఎక్కువగా జరుగుతూ వుంటాయి.

రాఘవేంద్ర స్వామి జన్మ నక్షత్రం రోజున ... ఆయన సన్యాసం స్వీకరించిన రోజున 'మంత్రాలయం'లో మాదిరిగానే ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన 'మంత్రాలయం' క్షేత్రాన్ని దర్శించిన ఫలితం దక్కుతుందని చెబుతుంటారు. ఇక్కడి రాఘవేద్రస్వామిని పూజించిన వారు గ్రహ సంబంధమైన దోషాల నుంచి బయటపడతారనీ, ఆయురారోగ్యాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles