కేదారేశ్వర క్షేత్రం

కేదారేశ్వర క్షేత్రం
పరమశివుడు దయామయుడు ... శరణు కోరిన వారిని శరము కంటే వేగంగా చేరుకొని కాపాడే కరుణామయుడు. చల్లని మనసున్న ఆ స్వామికి కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టం. ఈ కారణంగానే ఈ మాసంలో ఆయనకి సంబంధించిన క్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా 'తాటికొండ'వెలుగొందుతోంది.

గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో సదాశివుడు తొమ్మిది లింగరూపాల్లో ... తొమ్మిది పేర్లతో అలరారుతుంటాడు. ఈ తొమ్మిది రూపాల్లో కేదారేశ్వర స్వామిని ప్రధాన దైవంగా భక్తులు భావిస్తుంటారు. నవవిధ భక్తి మార్గాలకు సంకేతంగా కనిపించే ఈ ఆలయం నాటి ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది.

ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న ఆదిశంకరుల వారు, ఈ క్షేత్ర దర్శనం చేసుకున్నట్టుగా ఆధారాలు వున్నాయి. ఇక ఎంతో మంది యోగులు తమ తపో సాధనకు ఈ ప్రదేశం అనుకూలమైనదిగా భావించి ఇక్కడే వుండేవారు. ఇక ఈ స్వామివారిని ఎందరో రాజ వంశీకులు తమ ఇలవేల్పుగా భావించి పూజించారు. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే తాము అనేక యుద్ధాల్లో విజయాలు సాధించినట్టు నాటి రాజులు విశ్వసించేవారు. ఈ కారణంగానే యుద్ధానికి ముందు ఆ తరువాత స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించేవారు.

పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో రెండు కోనేర్లు దర్శనమిస్తూ వుంటాయి. ఈ కోనేటి నీటిని తలపై చల్లుకున్నంత మాత్రానే సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇక్కడి కేదారేశ్వరుడిని దర్శించుకోవడం వలన కేదారేశ్వరస్వామి వ్రతం చేసుకున్నంత ఫలితం లభిస్తుందని అంటారు. అందువలన కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles