గణపతి తొండం ఏవైపుకి తిరిగుండాలి?

గణపతి తొండం ఏవైపుకి తిరిగుండాలి?
వైష్ణవ భక్తులు విష్ణుమూర్తిని ... శైవ భక్తులు శివుడిని ... శాక్తేయులు అమ్మవారిని ఆరాధిస్తుంటారు. వీరంతా కలిసి గణపతిని పూజిస్తూ వస్తుండటం విశేషం. దేవలోకానికి అసురుల వలన ఆపద ఏర్పడినప్పుడు, మానవాళి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు గణపతి రక్షించిన ఘట్టాలు ఎన్నో వున్నాయి. మానవులు ... మహర్షులే కాదు, దేవతలు సైతం ఆయన ఆధిపత్యాన్ని అనుగ్రహంగా భావించి తరించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

విద్య .. ఉద్యోగం .. వివాహం .. సంతానం .. సౌభాగ్యం .. సంపదలు .. ఇలా ఏది కావాలన్నా గణపతి అనుగ్రహం కావలసిందే ... ఆయనకి తొలి పూజలు చేయవలసిందే. అలాంటి గణపతిని పూజించే సమయంలో కొంతమంది కొన్ని రకాల సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. వాటిలో గణపతి తొండం ఏ వైపుకి తిరిగి వుంటే మంచిదనే సందేహం ప్రధానంగా కనిపిస్తుంటుంది.

గణపతి తొండం కుడివైపుకి తిరిగి వుంటే మంచిదని కొందరు, ఎడమవైపుకి తిరిగి వుంటే మంచిదని మరికొందరు అంటూ వుంటారు. తమ విశ్వాసానికి తగిన వైపున తొండం వున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తుంటారు. అందుకు తగిన గణపతి ప్రతిమను సంపాదించడానికి నానాకష్టాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ... గణపతి తొండం ఏ వైపుకి తిరిగి వున్నా ఎలాంటి దోషం లేదని శాస్త్రం చెబుతోంది.

32 మంది వినాయక రూపాలు విశిష్టమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో రూపాన్ని పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తూ వుంటుంది. ఆ రూపాలు అందుబాటులో లేనప్పుడు, వున్న గణపతి ప్రతిమ సన్నిధిలో కోరికకు సంబంధించిన మంత్రం చెప్పుకుంటే సరిపోతుందని గణేశ పురాణం చెబుతోంది. అందువలన తొండం ఏ వైపు ఉండాలనే విషయంలో ఎలాంటి సందేహాలకి తావియ్యకుండా, భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించడం వలన తగిన ఫలితాన్ని పొందవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

More Bhakti Articles