వేల వరాల వెంకన్న

వేల వరాల వెంకన్న
కలియుగంలో సౌందర్యమంటే శ్రీ వేంకటేశ్వర స్వామిదే. ఆయన విగ్రహం ఎంత ఎత్తుగా వుంటే ఆయన సౌందర్యం అంతగా ఉట్టిపడుతూ వుంటుంది. వేంకటేశ్వరస్వామి అలంకారప్రియుడు. వివిధ రకాల పూలమాలికలతో ఆయన అలంకరించబడుతూ నయనానందాన్ని కలిగిస్తూ వుంటాడు. అలంకరణకు అనుకూలంగా వుండే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి చూసినా మనసు హరించబడుతుంది ... మోక్షం ప్రసాదించబడుతుంది.

అంతటి సుందర ... సుకుమారమైన విగ్రహం మనకి మహారాష్ట్ర - పూణె ఆలయంలో దర్శనమిస్తుంది. గర్భాలయంలో తిరుమల వెంకన్నను పోలిన 12 అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహం, భక్తజనకోటిని సమ్మోహితులను చేస్తుంది. ఇదే ప్రాంగణంలో సీతారాములు ... హనుమంతుడు ... వినాయకుడు ... ఆళ్వారులు పూజలు అందుకుంటూ వుంటారు.

అహోబిల మఠం వారు నిర్మించిన ఈ ఆలయం, అపూర్వమైన నగిషీలతో అద్భుతంగా దర్శనమిస్తూ వుంటుంది. ఆలయ ప్రాకారాలపై మలచబడిన దశావతార మూర్తులు మనసు వేదికపై చెరగని ముద్ర వేస్తాయి. వేల వరాలను ప్రసాదించే వెంకన్నగా ఇక్కడి స్వామికి భక్తులు నిత్యనీరాజనాలు పడుతూ వుంటారు.

వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన 'శ్రవణా నక్షత్రం' రోజున ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు ఘనంగా జరుపుతుంటారు. ఇతర పర్వదినాల్లోను విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి ... సేవించి ఆయన కరుణాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.

More Bhakti Articles