పూల గోవిందుడు

పూల గోవిందుడు
తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టగానే వైకుంఠపు వాకిట్లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. స్వామివారి పాదపద్మాల స్పర్శచే పునీతమైన నేలను తాకిన గాలి ... స్వామి వారి నిజ పాదాలను తాకిన గాలి ... స్వామివారి ఆనంద నిలయాన్ని తాకిన గాలి ... సాక్షాత్తు స్వామి సృష్టించిన జలాశయాలను తాకిన గాలి ... భక్తులను సున్నితంగా తాకుతూ తన్మయానికి గురిచేస్తుంటుంది.

స్వామివారి సన్నిధికి చేరువవుతున్నాకొద్దీ, ఈ గాలి వివిధ రకాల పూల సుగంధాన్ని మోసుకొస్తూ వుంటుంది. ఇక శ్రీనివాసుడి అభిషేకానికి పాలు ఎంత అవసరమో ... ఆయన అలంకారానికి పూలూ అంతే అవసరం. సాధారణమైన రోజుల్లోనే స్వామివారు వివిధ రకాల పూల మాలలతో నయన మనోహరంగా కనిపిస్తూ ఉంటాడు. ప్రతి నిత్యం శ్రీవారి సేవలకు గాను కేజీల కొద్దీ పూలను ఉపయోగిస్తూ వుంటారు. ఇక బ్రాహ్మోత్సవాల సందర్భంలో టన్నుల కొద్దీ పూలు ఉపయోగిస్తూ వుంటారు.

ఈ పూల జాబితాలో గులాబీలు .. చామంతులు .. ముద్దబంతులు .. మల్లెలు .. మందారాలు .. విరజాజులు .. గన్నేరులు .. నందివర్ధనాలు .. పొగడలు .. కాగడాలు .. లిల్లీలు .. సంపంగులు .. కనకాంబరాలు .. తులసి ... మరువం ... దమనం ... కనిపిస్తుంటాయి. తిరుమల స్థల మహాత్మ్యం కారణంగా ఈ పూలన్నీ కూడా ఎంతో ఆరోగ్యంగా నిగనిగలాడుతూ స్వచ్ఛంగా కనిపిస్తూ వుంటాయి.

బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి సేవలో పాలుపంచుకునే ఈ పూల రాశులను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. స్వామివారి వైభవమంతా ఈ పూలలోనే వుంటుంది కనుక, ఆయన సేవకు ఉపయోగించే పూలకోసం దేవస్థానం వారు దాదాపు 200 ఎకరాలకు పైగా పూలతోటలను పెంచుతున్నారు. 150 మందికి పైగా పనివారు ఈ తోటలను కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుంటారు.

ఇక బ్రహ్మోత్సవ వేడుకలకు గాను మరికొన్ని రకాల పూవులను వివిధ నగరాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పూలను తెప్పిస్తుంటారు. ఇక ఈ పూవులను మాలగా కట్టే అదృష్టం కోసం ఎంతోమంది వేచి చూస్తుంటారు. ఇక బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారికి జరిగే 'పుష్పాభిషేకం' చూసి తీరవలసిందే. అందమైన ... పరిమళభరితమైన ఈ పూవులు స్వామివారి కోసం పూసి ... ఆయన సేవలో ... ఆయన సన్నిధిలో వాడిపోతుంటాయి. అలాంటి సేవా భాగ్యం తమకి కూడా లభించాలనే భావనను ఆ ఉత్సవాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ కలిగిస్తూ వుంటాయి.

More Bhakti Articles