అందాల సాయి మందిరం

అందాల సాయి మందిరం
ప్రేమ .. దయ .. జాలి .. కరుణ .. ఇలాంటి వాటన్నింటికి ఒక రూపాన్ని ఇచ్చుకుంటే, అది శ్రీ శిరిడీ సాయిబాబా రూపమే అవుతుంది. దేవుడు ఒక్కడేననీ ... ఆ దేవుడికి తాను బానిసనని మాత్రమే బాబా అందరితో చెప్పాడు. సమస్త వ్యాధులకు ఔషదంగా ఆయన 'ఊది' ని ప్రసాదించాడే గాని, ఎప్పుడూ కూడా కనికట్లతో ... గారడీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదు.

తనని నమ్మిన వారి నుంచి ఆయన వ్యాధులను ... బాధలను స్వీకరించినా, ఏనాడూ వాటి గురించి ఇతరులకు చెప్పలేదు. ఈ రోజున ఇన్ని లక్షల మంది బాబాను ఆరాధించడానికి కారణం ఆయన చూపిన మహిమలు కాదు. తన భక్తుల పట్ల ఆయన చూపే అపారమైన వాత్సల్యమే అందుకు కారణం. ప్రేమే సాయి ప్రపంచం ... అనురాగమే ఆయన సామ్రాజ్యం. అక్కడ ఉండటానికే ఆయన భక్తులు తపిస్తుంటారు ... ఆయన ఆలయాల నిర్మాణంలో పాలుపంచుకుని తరిస్తుంటారు.

అలా నిర్మితమైన సాయి ఆలయం మనకి రంగారెడ్డి జిల్లా 'జూకల్' లో దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయం సువిశాలంగా సాయి మనసుకి అద్దం పడుతూ అత్యంత సుందరంగా కనిపిస్తూ వుంటుంది. ప్రధాన మంటపంలోని వేదికపై సాయి చిరుమందహాసంతో తన భక్తులను పలకరిస్తున్నట్టుగా కొలువై ఉంటాడు. ఆయన చూపులు ప్రేమామృతాన్ని పంచుతూ వుంటాయి. బాబాకి ప్రతి నిత్యం అభిషేకాలు ... నాలుగు హారతులు నిర్వహిస్తూ వుంటారు.

ప్రతి గురువారం ప్రత్యేక పూజలు ... విశేష సేవలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా సాయిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇక్కడి బాబాని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందని స్థానికులు చెబుతుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ... పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయ దర్శనం, అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles