శ్రీ ఆంజనేయ ఆలయం

 శ్రీ ఆంజనేయ ఆలయం
హనుమంతుడు మహా పరాక్రమవంతుడు...అంతకు మించిన జ్ఞాన సంపన్నుడు. అలాంటి హనుమంతుడిని ఆరాధించడం వలన, సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. 'రామ' మంత్రం ఎక్కడ వినిపిస్తే హనుమంతుడు అక్కడ ఉంటాడు. హనుమంతుడు ఎక్కడ వుంటే అక్కడ ఆరోగ్యం ... ఐశ్వర్యం ... విజయం నెలకొని వుంటాయి.

రామనామ సంకీర్తనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికిగాను హనుమంతుడు అన్ని రామాలయాల్లోను కొలువై ఉంటాడు. ఇక మూలమూర్తిగా కూడా అనేక క్షేత్రాల్లో వివిధ నామాలతో హనుమంతుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో హనుమంతుడికి సంబంధించిన ఎన్నో ప్రాచీన ఆలయాలు, నేటికీ తమ విశిష్టతను చాటుకుంటూనే వున్నాయి. అలాంటి మహిమాన్వితమైన ఆలయాలలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది.

ఇక్కడి ఆలయం చూడటానికి కాస్త చిన్నదిగా కనిపిస్తునప్పటికీ, దీని వెనుక వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఇక ఇక్కడి హనుమంతుడు స్వయంభువు కావడం మరో విశేషం. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అడవిలో ఒక భాగంగా వుండేది. అందువలన ఈ మార్గంలో సాధువులు ... సన్యాసులు తప్ప మరెవరూ కనిపించేవారు కాదు.

ఈ నేపథ్యంలో సాధువులు బస చేయడానికి ఇక్కడ ఒక చిన్నపాటి మఠం నిర్మించబడింది. అలా బసచేయబడిన కొందరు సాధువులకి అక్కడికి సమీపంలో నుంచి ''రామ్ ... రామ్'' అనే శబ్దం వినిపించసాగింది. ఆ దిశగా వెళ్లి చూసిన సాధువులకి అక్కడ హనుమంతుడి ప్రతిమ కనిపించింది. అశరీరవాణిగా స్వామి చెప్పిన ప్రకారం వారు ఆ స్వయంభువు ప్రతిమకు ఆక్కడే మందిరాన్ని నిర్మించారు.

నాటి నుంచి వారు స్వామికి పూజాభిషేకాలు నిర్వహించసాగారు. మహంతు గోవర్ధన దాస్ అనే భక్తుడి కారణంగా ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అడవి కాస్తా మహా నగరంగా మారిపోవడంతో ఇప్పుడు ఈ ఆలయం పరిధి మరింత చిన్నదిగా కనిపిస్తూ వుంటుంది. ఆలయ ద్వారంపై, తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపించే హనుమంతుడి ప్రతిమ దర్శనమిస్తూ వుంటుంది.

గర్భాలయంలో స్వామి మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన గ్రహపీడల బారి నుంచి బయటపడతారని అంటారు. నూతన వాహనాలకు ఈ స్వామి సన్నిధిలో పూజ జరిపించడం ఇక్కడ ఆనవాయతీగా మారిపోయింది. కాలక్రమంలో ఈ ప్రాంగణంలో రామమందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణంగా మంగళ - శనివారాల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ... శ్రీ రామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

More Bhakti Articles