యుద్ధ హనుమంతుడు

యుద్ధ హనుమంతుడు
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ... ఆ క్షేత్రాలు ఆవిర్భవించడానికి కారణమైన కథలను విన్నప్పుడు నిజంగానే అలా జరిగివుంటుందనే భావన కలుగుతూ వుంటుంది. అలాంటి విశ్వాసాన్ని బలంగా కలిగించే క్షేత్రాల్లో, కర్నూలు జిల్లాకి చెందిన 'రణ మండలం' కూడా కనిపిస్తుంది. 'రణం' అంటే యుద్ధం అని అర్థం. ఇక్కడి హనుమంతుడు యుద్ధం చేస్తున్నట్టుగా దర్శనమిస్తూ వున్న కారణంగానే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది.

ఇక్కడ ఎత్తు తక్కువగా వెడల్పు ఎక్కువగా గల కొండపై హనుమంతుడు కొలువై కనిపిస్తుంటాడు. రావణ సంహారం అనంతరం హనుమంతుడు తన సహచరులతో కలిసి ఈ కొండపైకి వచ్చినట్టుగా చెబుతారు. కొండపైకి చేరుకోవడానికి మెట్లదారితో పాటు వాహనాలు వెళ్లే దారికూడా వుంది. కొండపై 12 అడుగుల హనుమ విగ్రహం సిందూర వర్ణంలో ఆరుబయట కొలువై రాక్షస సంహారం చేస్తున్నట్టుగా దర్శనమిస్తుంది.

స్వామి ఆగ్రహావేశాలతో కనిపిస్తోన్న కారణంగా భక్తులు ఆయనకి తమలపాకుల దండలను సమర్పిస్తూ ... ఉపశమనం కలిగిస్తూ వుంటారు. ఈ కొండకి దగ్గరలో ప్రాచీనకాలం నాటి స్వయంభువు వినాయకుడు ... నాగదేవత ... భవానీమాత మూర్తులు కనిపిస్తూ వుంటాయి. పూర్వకాలంలో ఇక్కడ సిద్ధులు ఎలాంటి అంతరాయం కలగకుండా ధ్యానం చేసుకునేవారని తెలుస్తోంది.

ఇక్కడి హనుమంతుడిని దర్శించుకోవడం వలన శత్రువులు నశిస్తారనీ, సమస్త గ్రహపీడలు తొలగి శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. హనుమజ్జయంతి సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం పూట కొండపై ... సాయంత్రం వేళ గ్రామవీధుల్లోనూ స్వామివారికి ఊరేగింపు జరుపుతారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులే కాక, చుట్టుపక్కల గ్రామాలవారు సైతం ఉత్సాహంగా పాల్గొంటారు.

More Bhakti Articles