రాధా మదనమోహన స్వామి

రాధా మదనమోహన స్వామి
కృష్ణుడు అనగానే అందమైన అల్లరి గుర్తుకువస్తుంది ... రాధ అనగానే అల్లరితో కూడిన అందం కళ్లముందు కదలాడుతుంది. అల్లరికి ... అందానికి మధ్య అంకురించిన ప్రేమకి ప్రతీకలే రాధాకృష్ణులు. వాళ్లు నిజమైన ప్రేమకు నిర్వచనంగా నిలిచారు ... అసలైన అనురాగానికి అద్దంలా వెలుగొందారు. రాధాకృష్ణుల రసమయ కథామృతాన్ని గురించి ఎంతగా చెప్పుకున్నా సమయం తెలియదు. వారు ఆవిష్కరించిన ప్రేమతత్వం గురించి ఎంతగా పాడుకున్నా తనివితీరదు.

అలాంటి రాధాకృష్ణుల అమలిన శృంగార భావాలకు అక్షర రూపాన్ని కల్పించి, మధుర భక్తితో మనసుని అంకితం చేసిన మహాభక్తులు ఎందరో వున్నారు. వారు చూపిన మార్గంలో అశేష భక్తజన కోటిని నడిపించడానికి గాను 'అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం' (ఇస్కాన్) ఆవిర్భవించింది. విశ్వవ్యాప్తంగా వందలాది రాధాకృష్ణుల మందిరాలను ఈ సంఘం నిర్మిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనిదే హైదరాబాద్ - అబిడ్స్ లోని 'శ్రీ రాధా మదనమోహన స్వామి మందిరం'.

ఆలయ నిర్మాణంలోను ... విగ్రహాల తీరులోను ... అలంకరణలోను ఇస్కాన్ వారు ఒక ప్రత్యేకమైన శైలిని పాటిస్తూ వస్తుంటారు. ఇక్కడ కూడా అందమైన ఆ ముద్ర కనిపిస్తుంది. అందంగా తీర్చి దిద్దబడిన వేదికపై రాధాకృష్ణులు ... ప్రేమానురాగాలకి ప్రతిబింబాలుగా దర్శనమిస్తూ వుంటారు. ఇక ఇక్కడి ఆలయంలో పూరీ క్షేత్రంలోని ప్రతిమల మాదిరిగా శ్రీకృష్ణుడు .. సుభద్ర ... బలరాముడు కూడా కొలువైవుంటారు.

చైతన్య ప్రభువు ... నిత్యానందుడి చిత్రపటాలు ఇక్కడ కనిపిస్తూ వుంటాయి. ప్రశాంతంగా ... పవిత్రంగా కనిపిస్తూ, అందంగా ... అద్భుతంగా అనిపించడం ఈ ఆలయాల ప్రత్యేకత. అలాంటి ఈ ఆలయంలోకి అడుగుపెట్టడమే అదృష్టంగా ... ఆ స్వామిని పూజించడమే పుణ్యంగా భక్తులు భావిస్తుంటారు.

More Bhakti Articles