కుమారధార తీర్థ మహిమ

పరమపవిత్రమైన తిరుమలలో ఎన్నో మహిమాన్వితమైన తీర్థాలు భక్తులకు పుణ్య ఫలాలను అందిస్తున్నాయి. అలాంటి పుణ్య తీర్థాలలో 'కుమారధార తీర్థం' ఒకటి. ఈ తీర్థ మహాత్మ్యం గురించిన విశేషాలు పురాణాలలో సైతం దర్శనమిస్తాయి.

పూర్వం 'వృషభాచలం'పై ఆశ్రమం నిర్మించుకున్న ఓ బ్రాహ్మణుడు నిత్యం దైవారాధనలోనే నిమగ్నమై ఉండేవాడు. అలా భగవంతుడికి సేవలు చేయడంలోనే ఆయన వయసంతా గడిచిపోయింది. అయినా శిష్యుల సహాయంతో తన దైవారాధనకి ఆటంకం రాకుండా చూసుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాడు.

ఒక రోజున ఆయన పూజకి అవసరమైన పదార్థాల కోసం తన శిష్యుడిని అడవిలోకి తీసుకుపోయాడు. దారి తప్పిపోయిన శిష్యుడు వెనక్కి రాకపోవడంతో ఆ వృద్ధుడు ఆందోళన చెందసాగాడు. వంట్లో ఓపికలేని తాను ఒంటరిగా ఎలా తిరిగి వెళ్లాలో తెలియక కంగారుపడసాగాడు. అదే సమయంలో మానవరూపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అక్కడికి వచ్చి, ఆ వయసులో ప్రాణాలపై తీపి ఎందుకని ఆ వృద్ధుడిని అడిగాడు. తన ప్రాణాలపై తనకి ఎలాంటి మమకారం లేదనీ, దైవానికి తానెంతో రుణపడి వున్న కారణంగా అది తీర్చుకుని వెళ్లాలనేదే తన ఆరాటమని చెప్పాడతను.

అందుకు సంతోషించిన వేంకటేశ్వరుడు, ఆ వృద్ధుడిని 'కుమారతీర్థం' దగ్గరికి తీసుకువెళ్లి అందులో స్నానం చేయమని చెప్పాడు. అందులో స్నానం చేయగానే ఆ వృద్ధుడు ... నవయువకుడిగా మారిపోయాడు. తనని వెంటబెట్టుకు వచ్చినది శ్రీనివాసుడని ఆయన గ్రహించి స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వయసైపోయిన వారికి కౌమార్యాన్ని ప్రసాదించే తీర్థం కనుక దీనికి 'కుమారతీర్థం' అనే పేరు వచ్చింది.ఈ తీర్థంలో స్నానం చేసి తమ శక్తి మేరకు దానాలు చేసిన వారికి ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడింది.


More Bhakti News