మంత్రాలయం

భక్తుల పాలిట కామధేనువు ... కల్పవృక్షం శ్రీ రాఘవేంద్ర స్వామి. అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన రాఘవేంద్రస్వామి కొలువుదీరిన ప్రాంతమే 'మంత్రాలయం'. ఆయన జీవసమాధి చెందిన ప్రదేశమే బృందావనమై అశేష భక్త జనకోటి ఆరాధనలు అందుకుంటోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో అలరారుతోంది.

ఈ ప్రదేశంలో రేణుకాదేవి 'మంచాలమ్మ' గా పిలవబడుతూ పూజలు అందుకుంటుంది. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి మంచాల అనే పేరు వచ్చింది. ఆ తల్లి అనుమతితో ... అనుగ్రహంతో రాఘవేంద్ర స్వామి ఈ పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకోవడంతో అది 'మంత్రాలయం' గా మారిపోయింది. ఇక ఎన్నో పుణ్య తీర్థాలను దర్శించిన రాఘవేంద్రస్వామి ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం లేకపోలేదు. పూర్వం ఇక్కడ ప్రహ్లాదుడు తపస్సు చేయడమే కాకుండా ఎన్నో యజ్ఞాలు చేయడం వలన ఈ ప్రదేశం మహా పవిత్రమైనదని రాఘవేంద్ర స్వామియే స్వయంగా చెప్పాడు.

ఇక శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు ఆయనను ఆ ప్రహ్లాదుడి అవతారంగానే భావించి పూజిస్తుంటారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవేంద్ర స్వామి అసలుపేరు 'వేంకటనాథుడు'. అన్నగారి దగ్గర .. బావగారి దగ్గర... మఠంలోను ఆయన విద్యాభ్యాసం చేశాడు. సాక్షాత్తు సరస్వతీదేవి ఆదేశంతో ఆయన తన సంసార జీవితానికి స్వస్తి చెప్పి, రాఘవేంద్రస్వామిగా ఆశ్రమ జీవితాన్ని కొనసాగించారు.

దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే రాఘవేంద్ర స్వామి ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కున్నాడు. తనని పరీక్షించడానికి ప్రయత్నించినవారి కళ్లు తెరిపించాడు. చనిపోయిన వారిని సైతం బతికించిన మహాశక్తి సంపన్నుడు ఆయన. మహా సమాధి చెంది ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆయన తన భక్తులు పిలవగానే పలుకుతున్నాడు. వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్నాడు. ప్రతియేటా మంత్రాలయంలో శ్రావణ మాసంలో జరిగే ఆరాధనోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.


More Bhakti News