ఇలాంటి పూలను పూజకు వాడకూడదు

పూలతో చేసేదే పూజ అనేంతగా .. పూజలో పూలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేవతార్చనలో వివిధ రకాల పూలను ఉపయోగిస్తుంటారు. ఇక ఆయా దేవతలకి ఇష్టమైన పూల గురించిన విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తాయి. ఇష్టదైవమేదైనా తాజాగా కోసిన పూలను మాత్రమే పూజకి ఉపయోగించాలనేది మహర్షుల మాట. ఇక భగవంతుడికి సమర్పించడానికి ముందుగా పూలను వాసన చూడకూడదు. అలా వాసన చూస్తే ఆ పూలు పూజకు పనికి రావు.

 అలాగే అపవిత్రమైన ప్రదేశాల్లో పూసిన పూలు .. వాడిపోయిన పూలు .. పూర్తిగా వికసించని పూలు .. వాసన లేని పూలు .. ఘాటైన వాసన గల పూలను పూజకు వాడకూడదు. అలాగే కొంతమంది చెట్టుపై వున్న పూలు అందనప్పుడు .. కిందపడిన పూలను ఏరుకుని వస్తుంటారు. అలా నేలపై రాలిన పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు. చక్కని సువాసన గల తాజా పూలను మాత్రమే భక్తిశ్రద్ధలతో భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే పూజకు ఫలితంగా పుణ్యం దక్కుతుంది.  


More Bhakti News