కోరికలు నెరవేర్చు విజయగణపతి

కోరికలు నెరవేర్చు విజయగణపతి

కోరికలు నెరవేర్చు విజయగణపతి
వినాయకుడు విశ్వకల్యాణ కారకుడు ... విఘ్నాలను తొలగిస్తూ భక్తులను అనుగ్రహించే అధినాయకుడు. దేవతలచే సైతం తొలిపూజలు అందుకునే వినాయకుడు, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలు చూపే ఆరాధనా భావాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాడు.

మంత్ర పూర్వకమైన పూజా విధానాలకు ఆయన ఎలాంటి ఫలితాలను ఇస్తాడో, అవి తెలియక అంకితభావంతో ఆరాధించేవారికి కూడా ఆయన అదే విధమైన ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. తలపెట్టిన కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు ... ఆటంకాలు ఎదురుకాకుండా అంతా వినాయకుడిని పూజిస్తుంటారు. ఈ కారణంగానే వినాయకుడి ఆలయాలు ప్రతినిత్యం భక్తుల సందడితో కళకళలాడుతుంటాయి.

ఈ నేపథ్యంలో భక్తుల విశ్వాసాన్ని మరింతగా చూరగొన్న విశిష్టమైనటువంటి వినాయకుడి ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - విజయనగర్ కాలనీలో కనిపిస్తుంది. నాంపల్లి నుంచి మెహదీపట్నం వెళ్లే మార్గంలో గల ఈ కాలనీలో విజయగణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈ కారణంగానే ఈ కాలనీకి ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఇక్కడి గణపతి మూర్తి స్వయంభువు కావడం విశేషం.

అష్టగణపతి క్షేత్రాల్లో మాదిరిగానే స్వామి మూర్తి సిందూర అలంకారంతో దర్శనమిస్తూ ఉంటుంది. సిందూర శోభితుడైన వినాయకుడు అనేక దోషాలను తొలగించి విజయాలను ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఇక్కడి స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు తీసుకుంటే చాలు, విజయం వరించడం ఖాయమని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

నూతన వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇక్కడ తొలిపూజ జరిపించడం శుభప్రదమని భావిస్తుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో వైద్యశాలలు ఎక్కువగా ఉండటం వలన, రోగుల తాలూకు బంధువులు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. తమ వాళ్లు త్వరగా కోలుకునేలా చూడమని స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఎవరి ఏది కోరుకుంటే అది ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకు నిదర్శనం ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటమే.

More Bhakti Articles