దీపావళికి ఏ నూనెతో దీపాలు వెలిగించాలి ?

దీపావళి రోజు సాయంత్రం కాగానే స్త్రీలంతా స్నానం చేసి నూతన వస్త్రాలను ధరిస్తారు. మట్టి ప్రమిదలలో నూనె నింపి ... వత్తులను వాటిలో వేసి వెలిగించే పనిలో హడావిడిగా వుంటారు. ఇక ఎన్ని ప్రమిదలను వెలిగించాలి ... వాటిని ఎక్కడెక్కడ ఉంచాలనేది ముందుగా వాళ్లు అనుకున్నదానిని బట్టి వుంటుంది.

కొంతమంది తమ ఇంట్లో ఏ నూనె అయితే వుందో, ఆ నూనెతోనే దీపాలు పెడుతుంటారు. మరికొందరు నెయ్యితో దీపాలు వెలిగించడం మంచిదని భావిస్తుంటారు. ఏ నూనెతోనైనా దీపాలు వెలిగించవచ్చనేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే 'దీపావళి' రోజున మాత్రం 'నువ్వుల నూనె'తోనే దీపాలు పెట్టాలని శాస్త్రం చెబుతోంది.

దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వుల నూనెను ఆవేశించి ఉంటుందట. అందువలన నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలనేది ఈ రోజున పాటించవలసిన నియమంగా చెప్పబడుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. ఇలా దీపాలు వెలిగించడం వలన ప్రతి ఇల్లు ... ప్రతి వీధి నయనాందకరంగా కనిపిస్తూ వుంటాయి.

దీపం వెలుగులు ఎక్కడైతే విరజిమ్ముతూ ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. అలాంటి దివ్యమైన వెలుగులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంటాయి. అందువల్లనే ఈ రోజున నువ్వులనూనెతో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజిస్తూ వుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సిరిసంపదలను పొందుతుంటారు.


More Bhakti News