Chandrababu: రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి.... ఉద్యోగస్తులందరికీ ఒకటే విన్నపం: చంద్రబాబు

Chandrababu appeals employees ahead of postal ballots oepening
  • నెల్లూరులో భారీ రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • సింహపురి తిరగబడిందన్న చంద్రబాబు
  • వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోకు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

పవన్ కల్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్ కు నెల్లూరులో గల్లీగల్లీ తెలుసు అని వెల్లడించారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో, పవన్ కు కూడా నెల్లూరులో ప్రతి చోటు  తెలుసని, ఇదే విషయాన్ని పవన్ కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్ కు బాల్యం గుర్తుకువచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని అన్నారు. 

"అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ... ముగ్గురం కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా? అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే. మే 13న వైసీపీకి డిపాజిట్లు అయినా వస్తాయా? ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారి, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ నెల 13న అంతం పలకడానికి మీరంతా సిద్ధమా? 

ఈ యువతకు బంగారు భవిష్యత్ చూపించడం నా బాధ్యత, పవన్ కల్యాణ్ బాధ్యత. ఇవాళ జనసేన కండువా, ఇటు టీడీపీ జెండాల ఊపు చూస్తుంటే... సింహపురిలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు! రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. 

రాసిపెట్టుకోండి... మే 13న ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వస్తాయి. 25 లోక్ సభ స్థానాలకు 24... వీలైతే 25కి 25 మనం గెలుస్తున్నాం... 160కి పైబడి అసెంబ్లీ స్థానాలు కూడా మనమే గెలుస్తున్నాం. రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగుజాతి ముందుకుపోవాలన్నా సైకో ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేయాలి. 

రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా... 95 శాతం, వీలైతే 100 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించమని ఈ సింహపురి సభ నుంచి పిలుపునిస్తున్నా. 

డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అతను ఖర్చు పెట్టే డబ్బులు మీవే. జే బ్రాండ్ మద్యం ద్వారా వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియా, భూ మాఫియాలో వచ్చిన డబ్బులే. ఈ జలగ జగనన్న మీకిచ్చేది రూ.10... మీ దగ్గర కొట్టేసింది రూ.100... దోచింది రూ.1000! ఆస్తి మీది... దాని మీద ఫొటో సైకోది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. 

వ్యతిరేక ఓటు చీలకూడదు అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో... మేం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక విధాలుగా తగ్గాం, ప్రజల కోసం  సర్దుబాటు చేసుకున్నాం. మే 13 వరకు ప్రజల్లో ఇదే స్ఫూర్తి కొనసాగాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, బంగాళాఖాతంలో అంత్యక్రియలు చేయాలి" అని చంద్రబాబు వివరించారు.
Chandrababu
Employees
Postal Ballots
Nellore
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News