మోక్షానికి దూరం చేసేది కూడా కోరికలే

మోక్షానికి దూరం చేసేది కూడా కోరికలే
ఊహ తెలిసిన నాటి నుంచి చివరి శ్వాస విడిచే వరకూ నిలకడ లేకుండా చేసేది కోరికలే. వీటికి ఆరంభమే తప్ప అంతం లేదు. ఒకదాని తరువాత ఒకటిగా ఇవి పుట్టుకొస్తూనే వుంటాయి. ఈ కోరికలను నెరవేర్చుకోవడమే తమ ముందున్న ముఖ్య కార్యంగా కొంతమంది భావిస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూస్తే ... కోరికల జాబితాను సిద్ధం చేసుకుని, వాటిని వరుసగా నెరవేర్చుకుంటూ వెళ్లడమే జీవితానికి గల అర్థం ... పరమార్థమని భావిస్తున్నట్టు కనిపిస్తుంటారు.

నిజానికి కోరిక అనేది ఆశలో నుంచే పుడుతుంది. ఆ కోరిక నెరవేరకపోతే తీవ్రమైన నిరాశ కలుగుతుంది. కోరికల ఊబిలో చిక్కినవాళ్లు ఇలా ఆశ నిరాశల నడుమ ఊగిసలాడుతూనే వుంటారు. చివరిశ్వాస విడిచే సమయంలో కూడా, ఏదో ఒక కోరిక నెరవేర్చుకోకుండా పోతున్నట్టుగా అసంతృప్తితో కనిపిస్తారు. ఇలా కన్నుమూసిన వాళ్లు, విషయ వాసనల కారణంగా తిరిగి జన్మించడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్లీ కథ మొదలవుతుంది.

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కోరికలు ... వాటిని నెరవేర్చుకోవడానికి పడే కష్టాలతోనే మరో మారు జన్మ వృథా అవుతూ వుంటుంది. అందుకే కోరికలను జయించాలనేది మహర్షుల మాటగా కనిపిస్తూ వుంటుంది. కోరికలపై అదుపు సాధించిన వాళ్లే భగవంతుడి పాదాలను సమీపించగలుగుతారు. అందుకే కోరికలను అదుపులో ఉంచుకుని సంతృప్తితో కూడిన జీవితాన్ని కొనసాగించాలి. ఇచ్చినటువంటి జన్మను సార్ధకం చేసుకుని, చివరి నిమిషంలో భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

తనువు చాలించే ముందు మనసులో భగవంతుడి రూపం మినహా మరే కోరిక లేనివాళ్లకి మళ్లీ జన్మంటూ ఉండదు. తిరిగి జన్మంటూ లేకపోవడమే మోక్షమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. జీవించినంత వరకూ నానాకష్టాలు పెట్టే కోరికలు ... ఆ తరువాత కూడా మోక్షానికి అవసరమైన అర్హతను లేకుండా చేస్తుంటాయి. అందుకే మోక్షాన్ని కోరుకునే వాళ్లు కోరికలకు దూరంగా ఉండాలనే విషయాన్ని మరచిపోకూడదు.

More Bhakti Articles