తెల్లని పూల వలన ఏ గ్రహం శాంతిస్తుంది ?

తెల్లని పూల వలన ఏ గ్రహం శాంతిస్తుంది ?
పూజా మందిరం చెంత కూర్చుని పూజ చేసుకునే వాళ్లు ... దైవ దర్శనం కోసం ఆలయానికి బయలుదేరే వాళ్లు వివిధ రకాల పూలను సిద్ధం చేసుకుంటూ వుంటారు. పూలతో చేసేదే నిజమైన పూజ అని చెప్పబడుతోన్న కారణంగా, రకరకాల పూలను సేకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలుపు ... పసుపు ... ఎరుపు రంగు పూలను దైవానికి ఎక్కువగా సమర్పిస్తుంటారు.

ఒక్కో రకం పూలతో పూజించడం వలన ఒక్కో ఫలితం కలుగుతుంది. పూల విషయంలో ఆయా దైవాల ఇష్టాన్ని తెలుసుకుని ఆ పూలతో ఆరాధించడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రీతికరమైన పూలతో అర్చించడం వలన భగవంతుడు సంతృప్తి చెందుతాడనీ, సులభంగా ప్రసన్నమవుతాడని అంటారు. భక్తులు ఆ విషయాన్ని గురించి తెలుసుకుని ఆచరిస్తూ వుంటారు.

అలాగే నవగ్రహ సంబంధమైన దోషాలతో బాధలుపడుతోన్న వాళ్లు, ఆ గ్రహాలకు ఇష్టమైన పూలతో పూజిస్తే అవి శాంతించి అనుగ్రహిస్తాయని చెప్పబడుతోంది. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో రకం పూలు ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రహాలను వాటికి సంబంధించిన పూలతో పూజించడం వలన, ఆ గ్రహ సంబందిత దోషాలు తొలగిపోతాయని అంటారు. చంద్ర గ్రహాన్ని శాంతింపజేయాలంటే ఆయన్ని అర్చించడానికి 'తెల్లని పూలు' ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది.

మనసుకి ఆనందాన్ని ... ఆహ్లాదాన్ని కలిగించడంలో చంద్రుడు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. అలాంటి చంద్రుడి మనసు గెలుచుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే, తెల్లని పూలతో పూజించాలి. లేదంటే చంద్రుడిని తలపై ధరించి చంద్రశేఖరుడు అనిపించుకున్న శివుడిని కూడా తెల్లని పూలతో అర్చించవచ్చు. ఈ విధంగా చేయడం వలన కూడా చంద్రుడి అనుగ్రహం లభిస్తుందని చెప్పవచ్చు.

More Bhakti Articles