అసలైన ఆనందం ఎక్కడ వుంటుంది ?

అసలైన ఆనందం ఎక్కడ వుంటుంది ?
జీవితం ఆనందంగా గడచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ వుంటారు. అందుకోసం ప్రయత్నాలు ... ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వుంటారు. అయితే ఆనందమనేది అందరి విషయంలోను ఒకేలా వుండదు. ఒకరికి ఆనందాన్ని కలిగించినది మరొకరికి కలిగించకపోవచ్చు.

సాధారణంగా దేనినైతే ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుందో, అది సొంతమైనప్పుడు ఆనందం కలుగుతుంది. అసాధ్యమైనదేదో కోరుకుని, ఆ కోరిక నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వలన ... ఆశించిన ఉద్యోగం లభించడం వలన ... కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన ఆనందం పొందడం జరుగుతుంటుంది. అలానే ఇష్టపడిన వాహనాలు ... ఆభరణాలు ... వాహనాలు ... ఇళ్లు సొంతం చేసుకోవడం వలన ఆనందం కలుగుతుంది.

ఇక ఒక వయసు వచ్చేసరికి తమ పిల్లలు సాధిస్తోన్న విజయాలు ... వాళ్ల ఎదుగుదల ... ఆర్ధికంగా వాళ్లు స్థిరపడుతుండటం ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఆ తరువాత ఆనందం అనేది మనవాళ్లు ... మనవరాళ్లతో ముడిపడివుంటుంది. వాళ్లు చేసే అల్లరిపనులు ... వాళ్లకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసిపెట్టడంలో ఆనందాన్ని పొందడం జరుగుతూ వుంటుంది.

ఇలా జీవితంలో సుదీర్ఘమైన ప్రయాణం చేసిన తరువాత చాలా సాధించినట్టు ... తన పాత్రకి పరిపూర్ణమైన న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. జీవితంలో పైకి రావడానికి తాను పడిన కష్టాలు ... చేసిన త్యాగాలు ... సాధించిన విజయాలు ... అందుకున్న అభినందనలు ... పొందిన ఆనందాలు ఆ సమయంలో కళ్లముందు కదలాడతాయి. అప్పుడు ఆనందం కలిగినా అంతకు మించినదేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది.

ఆలోచించగా .. ఆలోచించగా అప్పటివరకూ తాము పొందినది తాత్కాలికమైన ఆనందమే గానీ, శాశ్వతమైన ఆనందం కాదని గ్రహిస్తారు. అసలైన ఆనందం ... ఆత్మానందమనీ, అది భగవంతుడి సేవలో మాత్రమే పొందగలమని తెలుసుకుంటారు. యజమానిగా బాధ్యతలను నిర్వహించడం తన ధర్మమే అయినా, దాని పరిధిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్లి భగవంతుడిని మనస్పూర్తిగా ఆరాధించలేక పోయినందుకు బాధపడతారు. అలా అంతవరకూ జరిగిన ఆలస్యానికి చింతిస్తారు ... దైవ చింతనలో అసలైన ఆనందాన్ని ... ఆత్మానందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు.

More Bhakti Articles