దైవశక్తులు ఇంట్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి ?

వీధిలో వెళుతూ కొన్ని ఇళ్లను చూసినప్పుడు అవి ఎంతో అందంగా ... కళగా కనిపిస్తూ వుంటాయి. మరికొన్ని ఇళ్లు కళావిహీనంగా అనిపిస్తూ వుంటాయి. భారీగా కనిపిస్తున్నా కళగా లేకపోవడానికి కారణమేమిటోనని అనుకుంటూ వుంటారు. ఆ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించకపోవడమే అందుకు కారణమనే విషయం కొంతమందికే తెలుస్తుంది.

సాధారణంగా నివాసగృహాల్లోకి దైవశక్తులు ... దుష్టశక్తులు ప్రవేశిస్తూ వుంటాయి. దైవ శక్తులు ప్రవేశించడం వలన ఆ కుటుంబం అన్ని విషయాల్లోనూ ఆనందకరంగా వుంటుంది. దుష్టశక్తులు ప్రవేశించడం వలన మానసిక ప్రశాంతతను కోల్పోయి అనారోగ్యాల పాలవుతుంటారు.

ఈ నేపథ్యంలో .. ఇంటి ముఖద్వారం దెబ్బతినకుండా, చెదలుపట్టకుండా చూసుకోవాలి. ఎప్పుడూ మామిడి తోరణాలతో పచ్చగా కనిపించాలి. ద్వారానికి పైభాగంలో ఇష్టదేవత చిత్రపటం ఉంచాలి. గుమ్మానికి రెండు వైపులా ఓం - స్వస్తిక్ గుర్తులు వుండాలి. గడపలను ఎప్పటి కప్పుడు పసుపు కుంకుమలతో అలంకరిస్తూ వుండాలి. కుటుంబ సభ్యులు రెండు పూటలా దీపారాధన చేస్తూ, నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ వుండాలి. అలాంటి వారి ఇళ్లలోకి దైవశక్తులు ప్రవేశించి, ఆ కుటుంబసభ్యులకు అంతా మంచే చేస్తుంటాయి.

ఇక ఇందుకు భిన్నంగా వుండటం వలన దుష్ట శక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్టు అవుతుంది. ఇంట్లో పాతసామాన్లు ... పగిలిపోయిన సామాన్లు వున్నప్పుడు .. పాదరక్షలను ఇంట్లో విడిచినప్పుడు ... ఇంట్లో తగిననంత వెలుతురు లేనప్పుడు దుష్టశక్తులు వాటిని ఆశ్రయించి వుంటాయి. ఫలితంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఇంటిని ఎప్పుడూ ఒక దేవాలయంగా పవిత్రంగా చూసుకోవాలనే విషయాన్నీ గమనించాలి. అప్పుడే అక్కడ దైవశక్తులు ఆవాసముంటూ శుభాలను చేకూరుస్తాయని గ్రహించాలి.


More Bhakti News