దేవుళ్ల పట్ల ఇష్టాలను మార్చుకోవచ్చా ?

దేవుళ్ల పట్ల ఇష్టాలను మార్చుకోవచ్చా ?
సాధారణంగా అలవాట్లు ... అభిరుచులు కలిసిన వాళ్లు స్నేహితులవుతుంటారు. కొంతకాలం పాటు అలా సాగిన స్నేహం, కొన్ని కారణాల వలన చెడిపోతుంటుంది. తమ స్నేహం దేనివలన దెబ్బతిందో ... అందుకు ఎవరు ఎంతవరకు కారకులో ఎవరూ ఆలోచించరు. అప్పటివరకూ తమ మధ్యగల స్నేహాన్ని మరిచిపోయి ఎవరికి వాళ్లు ఇతరులతో స్నేహం చేస్తుంటారు.

ఇక కొంతమంది దేవుడి విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ముందుగా ఏ వేంకటేశ్వరస్వామినో తమ ఇష్ట దైవంగా చెప్పుకుంటూ, ఆయన ఆలయాలచుట్టూ తిరుగుతూ కనిపిస్తారు. తమ భవిష్యత్తుకు సంబంధించిన ఏదో ఒక పనిని చేసి పెట్టమంటూ ఒక శుభముహూర్తాన వేంకటేశ్వరస్వామికి చెప్పుకుంటారు. ఆ పనికాకపోతే అపర భక్తులమైన తమకి అన్యాయం జరిగిపోయినట్టుగా భావించి, రాముడిని గానీ ... శివుడిని గాని ఆశ్రయిస్తారు.

ఇక ఇక్కడ కూడా తమ భక్తికి తగిన ప్రయోజనం కనిపించకపోతే, బాబాదే భారమనుకుంటూ ఆయన మందిరాన్ని దర్శించి పూజలు చేయిస్తారు. నిజం చెప్పాలంటే ఈ విధమైన తీరు వారి యొక్క వ్యక్తిత్వానికి అద్దంపడుతూ ఉంటుంది. భక్తి విషయంలో ... భగవంతుడి విషయంలో వాళ్లు పరిపక్వతను సాధించలేదని తెలుస్తుంది. భగవంతుడు ఒక్కడే ... ఆయనే అనేక రూపాలతో కొలవబడుతుంటాడు ... వివిధ నామాలతో పిలవబడుతుంటాడు. ఒక దైవం తీర్చలేదని చెప్పేసి మరొక దైవం ఎదుట తమ కోరికను ఉంచడం నిజంగా అమాయకత్వమే.

దేవుళ్లను మార్చుకుంటూ ... పూజా మందిరాల్లో వాళ్ల చిత్రపటాలను మార్చుకుంటూ వెళ్లడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. భగవంతుడు అభిషేకాలను ... అలంకారాలను ... ఖరీదైన నైవేద్యాలను కోరుకోడు. ఎందుకంటే అనంతమైన ఈ విశ్వంలో ఆయనది కానిదిలేదు ... ఆయనకి లేనిది లేదు. భక్తుల నుంచి భగవంతుడు ఆశించేది అంకితభావాన్ని ... బలమైన విశ్వాసాన్ని. ఈ రెండూ వుంటే తమకి కావలసిన వాటిని గురించి ప్రత్యేకంగా భగవంతుడిని అడగవలసిన పనిలేదు. తన భక్తులకు ఏది ఎప్పుడు ఎంతవరకూ ఇవ్వాలో అంతవరకూ అనుగ్రహిస్తూనే ఉంటాడు.

More Bhakti Articles