దేవుడి మనసు గెలుచుకోవడం కష్టమా ?

దేవుడి మనసు గెలుచుకోవడం కష్టమా ?
అనేక వ్యసనాలకి బానిస అయిన పుండరీకుడు, తల్లిదండ్రులకు తలవంపులు తీసుకువస్తాడు. పరువు ప్రతిష్ఠలు వీధిన పడటంతో భార్య పుట్టినింటికి వెళ్లిపోతుంది. ఆస్తిపాస్తులకు ... కుటుంబసభ్యులకు దూరమైన పుండరీకుడు, జీవితమంటే ఏమిటో తెలుసుకుంటాడు. భగవంతుడి నామస్మరణంలోగల సంతోషం ... ఆయన సేవలోగల సంతృప్తిని అర్థం చేసుకుంటాడు.

తల్లిదండ్రులను వెతికి ఇంటికి తీసుకువస్తాడు. గతంలో వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. ఓ వైపున పాండురంగడిని పూజిస్తూ, మరోవైపున తల్లిదండ్రులను సేవిస్తూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతుంటాడు. పుండరీకుడు తమకన్నా ఎక్కువగా స్వామిని ఆరాధిస్తున్నందుకు ఆయన తల్లిదండ్రులు సంతోషిస్తారు. అదే సమయంలో పుండరీకుడి భార్య అక్కడికి చేరుకుంటుంది. తన భర్తలో తను ఆశించిన మార్పు వచ్చినందుకు ఆనందంతో పొంగిపోతుంది.

పాండురంగడిపై పుండరీకుడికి గల అచెంచలమైన భక్తి విశ్వాసాలు ఆయన పాపాలను పటాపంచలు చేస్తాయి. దాంతో పాండురంగడు ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. తన సేవ కన్నా తల్లిదండ్రులకు ఆయన చేసిన సేవలు తన మనసు గెలుచుకున్నాయని స్వామి చెబుతాడు. ఎక్కడైతే తల్లిదండ్రులు పూజించబడతారో, అక్కడ తాను ఉంటానని అంటాడు. ఇక మీదట ఆ క్షేత్రం పుండరీకుడి పేరు మీదనే ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు.

సాక్షాత్తు పరమాత్ముడి దర్శన భాగ్యాన్ని కలిగించిన పుత్రుడిని కన్నందుకు పుండరీకుడి తల్లిదండ్రులు మురిసిపోతారు. తల్లిదండ్రులతోను ... భార్యతోను కలిసి నిరంతరం ఆ పాండురంగడిని సేవించిన పుండరీకుడు, భక్తితో భగవంతుడి మనసు గెలుచుకోవడం చాలా తేలిక అనే విషయాన్ని చాటిచెబుతాడు. తాను స్వామిలో ఐక్యం కావడమే కాకుండా ... తన వాళ్లకు సైతం ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించినవాడవుతాడు.

More Bhakti Articles