శివలింగంపై దర్శనమిచ్చే నాగుపాము !

శివలింగంపై దర్శనమిచ్చే నాగుపాము !
పరమశివుడు ... కాలుడు అనే పేరుతో పిలవబడుతుంటాడు. కాలము అనే మాటకు సర్పము అనే అర్థం కూడా చెప్పబడుతోంది. ఇందుకు సంకేతంగానే శివుడు నాగుపామును మెడలో ధరించి కనిపిస్తుంటాడు. చిత్రపటాల్లోను ... విగ్రహ రూపాల్లోనూ శివుడు పాముని ధరించి కనిపిస్తూ ఉంటాడు. అవి మానవులు గీసినవి ... చెక్కినవి కనుక పెద్దగా పట్టించుకోము.

అయితే నాగుపాము నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి, అక్కడి శివలింగానికి చుట్టుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విషయమని చెప్పక తప్పదు. అలాంటి మహిమాన్వితమైన సంఘటనకు వేదికగా నిలిచే క్షేత్రం మనకు మహారాష్ట్రలో గల 'ఔండా నాగనాథ్' లో దర్శనమిస్తుంది. ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకునే ఈ ఆలయంలో సదాశివుడు ... నాగేశ్వరుడుగా, పార్వతీదేవి ... నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.

యుగాలక్రితం నాటిదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని చూడగానే, పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువుదీరి ఉన్నాడనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నాగేశ్వరుడిని దర్శించాలనుకునే వాళ్లు బిల మార్గంలో లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. బిలంలోకి ప్రవేశించే మార్గం ఇరుకుగా ఉన్నప్పటికీ, లోపలి ప్రదేశం స్వామివారి చుట్టూ భక్త బృందం కూర్చుని పూజాభిషేకాలు జరిపించేంత విశాలంగా ఉంటుంది.

అప్పుడప్పుడు ఒక నాగుపాము ఈ ఆలయంలోకి ప్రవేశించి, శివలింగానికి చుట్టుకుంటుందట. అలా కొంతసేపు స్వామికి పడగవిప్పి ఆభరణంగా అమరి ఆ తరువాత వెళ్లిపోతుందట. ఆ పాము వెళ్ళేంత వరకూ అభిషేకాలు ఆపేసి ఆ తరువాత కొనసాగిస్తుంటారు. స్వామివారు నాగేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉండటానికి ఇది ప్రత్యేక నిదర్శనమని భక్తులు చెబుతుంటారు.

More Bhakti Articles