అభిషేక నైవేద్యాల్లో కొబ్బరికాయ పాత్ర

అభిషేక నైవేద్యాల్లో కొబ్బరికాయ పాత్ర
భారతీయుల ఆధ్యాత్మిక జీవనవిధానంతోను ... సంప్రదాయబద్ధమైన జీవనవిధానంతోను కొబ్బరికాయ విడదీయరాని సంబంధాన్ని కలిగి కనిపిస్తుంది. ఎక్కడ దైవకార్యం జరుగుతున్నా ... శుభకార్యం జరుగుతున్నా కొబ్బరికాయ అక్కడ ప్రధానమైన పాత్రను పోషిస్తూ దర్శనమిస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఎవరు ఏ పనిని ఆరంభించాలన్నా అది కొబ్బరికాయ కొట్టడంతోనే మొదలవుతుంది.

ఇలా కొబ్బరికాయ ప్రాచీనకాలం నుంచి కూడా తన విశిష్టతను చాటుకుంటూనే ఉంది. పూజలో కలశానికి .. అభిషేకానికి .. నైవేద్యానికి కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉండటం దాని ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. ఇక పూజ విషయానికే వస్తే కొంతమంది ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ ధ్వజ స్తంభం ఎదురుగా కొబ్బరికాయ కొడతారు. అందులోని నీళ్లు తాగేసి ఆ చిప్పలను గుడిలో నైవేద్యానికి ఇస్తుంటారు.

ఈ విధంగా చేయడం దోషంగా చెప్పబడుతోంది. కొబ్బరికాయ కొట్టి అందులోని నీళ్లను తాగితే, ఎంగిలి చేసిన నైవేద్యం దైవానికి సమర్పించిన పాపం తగులుతుంది. అలాగే ఇంట్లో అభిషేకం నిమిత్తం కొబ్బరికాయను కొట్టడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరికాయ కొంచెం పగిలి అందులో నుంచి నీళ్లు ధారగా వస్తుంటే చాలు అలాగే దైవానికి అభిషేకం చేసేస్తుంటారు. దీనిని కూడా శాస్త్రం దోషంగానే చెబుతోంది.

కొబ్బరికాయను పూర్తిగా పగులగొట్టి అందులోని నీటిని ఒక పాత్రలోకి పట్టి, ఆ పాత్రతో దైవానికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇక ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటితో అభిషేకం చేసి ... ఆ తరువాత ఆ చిప్పలనే నైవేద్యంగా సమర్పించకూడదనే నియమాన్ని కూడా మరిచిపోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ కొబ్బరికాయను సమర్పించడం వల్లనే పూజ వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles