ఫాల్గుణ మాసం ప్రత్యేకత

 ఫాల్గుణ మాసం ప్రత్యేకత
తెలుగు మాసాలలో చివరిదైన 'ఫాల్గుణ మాసం' కూడా ఎన్నో పుణ్య తిథులను కలిగినదిగా కనిపిస్తుంది. ఎన్నో వ్రతాలు ... మరెన్నో పండుగలు ... ప్రత్యేకించి చేయవలసిన దైవారాధనలకు ఈ మాసం వేదికగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంతానాన్ని ఆశించేవారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు పన్నెండు రోజుల పాటు 'పయోవ్రతం' చేస్తుంటారు.

ఇక ఫాల్గుణ శుద్ధ తదియ రోజున 'మధుకతృతీయ వ్రతం' ... ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ... ఫాల్గుణ శుద్ధ అష్టమి బుధవారం రోజున 'బుధాష్టమీ వ్రతం' ... ఫాల్గుణ శుద్ధ నవమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తూ 'ఆనంద నవమి వ్రతం' జరుపుతుంటారు.

ఇక ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే 'ఆమలక ఏకాదశి' గా పిలుస్తుంటారు. ఈ రోజున ఉసిరిచెట్టు కింద విష్ణుమూర్తిని పూజించడం వలన, ఉపవాస జాగారణాలు చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ఇక తన తపస్సుకు భంగం కలిగించిన మన్మథుడుని శివుడు తన మూడో నేత్రంతో భస్మం చేసినది ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజునే. ఈ సందర్భంగా ఈ రోజున 'కామదహనం' జరుపుతారు. ఈ పండుగ చేసే సందడి పట్నాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఆ మర్నాడే అంటే ఫాల్గుణ పౌర్ణమి రోజున 'హోళికా' అనే రాక్షసి సంహారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'హోలీ'పండుగ జరుపుతుంటారు. ఇలా సంతాన సౌభాగ్యాలను .. విజయాలను కోరుకునే వ్రతాలు, సందడిగా సంతోషాలను పంచే పండుగలతో ఈ మాసం ముందుకుసాగుతూ ఉంటుంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ .. ప్రకృతి పరంగా అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేస్తూ నిష్క్రమిస్తుంది.

More Bhakti Articles