ఆలయ ప్రదక్షిణకు అవకాశం లేకపోతే ?

ఆలయ ప్రదక్షిణకు అవకాశం లేకపోతే ?
సాధారణంగా ప్రతి ఊళ్లోనూ ఏదో ఒక ఆలయం ఉంటూవుంటుంది. రామాలయంగానీ ... శివాలయంగానీ ... అమ్మవారు ఆలయంగాని అక్కడి పూర్వీకుల విశ్వాసాన్ని బట్టి కొలువై కనిపిస్తుంటాయి. ఇక ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడమనేది, భక్తి శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది. కొందరిలో ప్రతి నిత్యం ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం ఒక అలవాటుగా కనిపిస్తుంది. మరికొందరేమో పండుగ సందర్భాల్లో మాత్రమే ఆలయానికి వెళుతూ ఉంటారు.

ఏ ఆలయానికి ఎప్పుడు వెళ్లినా ముందుగా స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఆ తరువాతనే దర్శనం చేసుకోవడమనేది ప్రాచీనకాలం నుంచి ఒక నియమంగా వస్తోంది. ప్రదక్షిణ అనేది హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చేయాలని శాస్త్రం చెబుతోంది. గర్భాలయంలోని మూలమూర్తి కింద శక్తి యంత్రం ఉంటుంది కనుక, ప్రదక్షిణ చేస్తున్న వాళ్లు పెద్దగా చప్పుడు చేస్తూ అడుగులు వేయకుండా నిదానంగా నడవాలనేది కూడా ఈ నియమంలో భాగంగానే కనిపిస్తుంది.

ప్రదక్షిణ సమయంలోనే భగవంతుడిపై మనసు లగ్నమవుతుంది. ఆలయంలోకి రాగానే స్వామిపై స్థిరంగా దృష్టి నిలపడానికి దోహదపడుతుంది. అయితే నిర్మాణపరమైన కారణాల వలన కొన్ని ఆలయాలలో ప్రదక్షిణ చేసుకోవడానికి తగిన స్థలం గానీ, ఏర్పాట్లు గాని కనిపించవు. దాంతో ప్రదక్షిణలు చేయాలనుకున్న వాళ్లు అసంతృప్తికి లోనవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే సందేహం కొంతమందిలో కలుగుతూ ఉంటుంది.

ఆలయంలో గానీ ... మందిరంలో గాని ప్రదక్షిణలు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఎవరికి వారు తమ కుడి వైపు నుంచి ఎడమవైపుకు తిరుగుతూ 'ఆత్మ ప్రదక్షిణం' చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన మామూలుగా ప్రదక్షిణం చేసిన ఫలితమే కలుగుతుందనీ, జన్మజన్మాల పాపాలు నశిస్తాయని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles