మహాశివరాత్రి రోజున ఏం చేయాలి ?

మహాశివరాత్రి రోజున ఏం చేయాలి ?
మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మహాశివరాత్రి చెప్పబడుతోంది. జీవితకాలంలో ఒక్కసారైనా శివరాత్రి రోజున ఉపవాస జాగరణలతో శివుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ రోజున తనని ఎవరైతే త్రికరణశుద్ధిగా పూజిస్తారో, ఉపవాస జాగరణలతో సేవిస్తారో వాళ్లని తాను అనుగ్రహిస్తానాని సాక్షాత్తు సదాశివుడు పార్వతీదేవితో చెప్పినట్టుగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి.

లోక కల్యాణం కోసం శివుడు 'మాఘబహుళ చతుర్దశి' రోజున లింగరూపంలో ఆవిర్భవించాడు. అలా ఆయన జ్యోతి స్వరూపుడై ఆవిర్భవించిన అర్థరాత్రి సమయాన్నే లింగోద్భవ కాలమని అంటారు. ఆదిదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ సమయంలోనే ఆయనకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది. మహాశివరాత్రి రోజున పరమశివుడి పూజ ... ఉపవాసం ... జాగరణ అనే మూడు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి.

ఈ రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి, పూజామందిరంలోని శివపార్వతుల చిత్ర పటాన్ని అలంకరించాలి. శివ నామస్మరణ చేస్తూ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. పధ్నాలుగు లోకాలలోని పుణ్య తీర్థాలు శివరాత్రి రోజుకి బిల్వవృక్షం మూలానికి చేరుకుంటాయని చెప్పబడుతోంది. అందువలన శివుడిని ఈ రోజున బిల్వదళాలతో పూజించాలి. వివిధ రకాల ఫలాలను నైవేద్యాలుగా సమర్పించాలి.

ఈ రోజున కడుపునిండుగా తింటే కునుకు పడుతుంది. దాంతో సదాశివుడి ఆవిర్భావంతో తమకి ఎలాంటి సంబంధంలేదని చెప్పినట్టుగా అవుతుంది. అందువలన నిద్రకి దూరంగా ఉండటం కోసం ఈ రోజున ఉపవాస దీక్ష చెప్పబడింది. ఇక నిద్రపోవడమంటూ జరిగితే అది నిర్లక్ష్యానికి .. బద్ధకానికి సూచనగా నిలుస్తుంది ... ఆదిదేవుడికి ఆహ్వానం పలికే అదృష్టం చేజారిపోతుంది. అందుకే ఉపవాస జాగరణలు చేయాలి ... శివ నామస్మరణతోనే ఆకలినీ .. నిద్రను తరిమికొట్టాలి.

ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా త్రిలింగ క్షేత్రాలలో ఒకదానిని గానీ. పంచారామాలలో ఒకదానిని గాని, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకదానిని గాని దర్శించడం వలన అనేక జన్మలపాటు అనుభవించవలసిన పుణ్యఫలాలు వెంటవస్తాయి. ఇక ఈ రోజున ఎవరి శక్తానుసారం వారు ఇతరులకు దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున లింగోద్భవ కాలం (అర్థరాత్రి సమయం) లోను పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం అనంతమైన పుణ్య ఫలలాలను అందిస్తుంది. ఈ విధంగా తనువునూ ... మనసును శివుడికి అంకితంచేస్తూ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడుతోంది.

More Bhakti Articles