బండరాయి నడచిన చోటు

బండరాయి నడచిన చోటు
కొన్ని పుణ్యక్షేత్రాలలో చోటుచేసుకున్న సంఘటనలు విన్నప్పుడు నిజంగానే అలా జరిగి ఉంటుందా? అనే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కానీ మహిమాన్వితమైన ఆ సంఘటనలు జరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఉన్నారనే సంగతి తెలిసినప్పుడు ఆ సంఘటనపట్ల మరింత కుతూహలం రేకెత్తుతూ ఉంటుంది. చాలాకాలం కిందట అలాంటి సంఘటన ఒకటి మెదక్ జిల్లా 'కొల్కూరు'లో చోటుచేసుకుంది.

ఈ ఊళ్లో ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ, నాగలిపై బరువు కోసం ఆ పక్కనే గల ఓ చిన్న గుట్ట వంటి ప్రదేశం నుంచి ఒక రాయిని తెచ్చి తన పని పూర్తిచేస్తాడు. ఆ రైతు భోజనానికి వెళ్లి వచ్చేసరికి ఆ బండరాయిని తాను ఎక్కడి నుంచైతే తీసుకువచ్చాడో అది అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. రెండో సారి ... మూడోసారి ఆయన దానిని తీసుకువచ్చినప్పటికీ అలాగే జరుగుతుంది.

దాంతో ఎవరైనా తనని ఆటపట్టిస్తున్నారేమోననే విషయం తేల్చుకోవడం కోసం ఆయన ఆ బండరాయిని పరిశీలిస్తూ దానికి కొంత దూరంలో కూర్చుంటాడు. కొంత సేపటికి ఆ బండరాయి దానంతట అదే కదులుతూ వెళ్లి ఎప్పటి చోటునే ఆగిపోతుంది. ఆశ్చర్యపోతూ దానిని అనుసరించిన ఆ రైతు, అక్కడ ఓ రంధ్రం ఉండటం అప్పుడు గమనిస్తాడు. ఆ రాయిని పక్కకి జరిపి ఆ రంధ్రం గుండా చూసిన రైతుకి లోపల ఓ దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు శివుడి ఆకారంలో ఉండటాన్ని ఆయన గమనిస్తాడు.

అది ఒక గుహ అనీ ... ఆ రంధ్రం తప్ప దానికి ఏ వైపు నుంచి కూడా దారిలేదనే విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. ఆయన ద్వారా ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు అది శివ సన్నిధానమనే నిర్ధారణకి వస్తారు. ఆ పక్కనే గల మారేడు చెట్టు ... రుద్రాక్ష చెట్టు ఉండటం వారి నమ్మకానికి మరింత బలాన్నిస్తుంది. గుహ లోపలికి వెళ్లే మార్గం లేకపోవడం వలన, గుహ రంధ్రాన్ని తనకి తానుగా మూస్తోన్న బండరాయినే వాళ్లు శివలింగంగా భావించి పూజించడం మొదలుపెడతారు. అలా ఇది విశిష్టమైనటు వంటి శైవ క్షేత్రంగా విలసిల్లుతోంది.

More Bhakti Articles