గురుగింజలు సంపదనిస్తాయా ?

గురుగింజలు సంపదనిస్తాయా ?
గురుగింజలు గురించి ఒకప్పటి వారిలా ఇప్పటివారికి తెలియకపోవచ్చు. పల్లెటూరి వారికి పరిచయమున్నంతగా అవి పట్నంవారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే పల్లెల్లో గురుగింజల చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఒకప్పుడు వీటి కాత విపరీతంగా ఉండటం వలన వీటి గురించి ఎక్కువ మందికి తెలిసింది.

గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే పాటల్లోనూ గురుగింజల ప్రస్తావన కనిపిస్తుంది. 'గురుగింజ ఎత్తు బంగారం' అంటూ దానిని కొలమానంగా చెప్పడం వింటూ ఉంటాం. గురుగింజపై సామెత ఉందంటే, అవి ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. గురుగింజలులో ఎక్కువభాగం ఎరుపు రంగులో ఉండి, తక్కువ భాగం నలుపు రంగు ఉంటుంది. రంగుల కలయిక కారణంగా చూడటానికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి.

అయితే అందంగా కనిపించడం ఒక్కటే కాదు, వీటివలన అనేక ప్రయోజనాలు ఉన్నట్టుగా చెబుతారు. గురుగింజలు లక్ష్మీ కారకాలనీ ... వీటిని భద్రపరచిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉండవని అంటారు. ఈ కారణంగానే పూర్వం గురుగింజలను తమ ఇంట్లో ఉండేలా చూసుకునేవారు.

ఇంట్లో ధనాన్ని ఉంచే చోట గురిగింజలు ఉంచడం వలన సంపదలు రెట్టింపు అవుతాయనే విశ్వాసం కూడా ప్రాచీన కాలం నుంచి ఉంది. సంపదలు పెరగడానికి ఉపయోగపడటమే కాకుండా, ఆ సంపదలకు దిష్టి తగలకుండా చేసే శక్తి కూడా గురుగింజలకు ఉంది. ఈ కారణంగానే నేడు అరుదుగా లభిస్తోన్న గురుగింజలను మరింత అపురూపంగా భద్రపరుస్తున్నారు ... లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు.

More Bhakti Articles