దేవుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి ?

 దేవుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి ?
కోరికలు కలగడం సహజం ... ప్రతిఒక్కరూ ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కోరికలకు అంతనేది వుండదు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. సొంతఇల్లు ఇలా ఒకదాని తరువాత ఒకటి పుడుతూనే వుంటాయి. సాధారణమైన కోరికలైతే వాటిని తీర్చుకునే అవకాశాల కోసం అన్వేషిస్తుంటారు. తమ వలన కాదని తెలిసినప్పుడు ఆ కోరికను నెరవేర్చే భారం దేవుడిపైనే పెడుతుంటారు.

సాధ్యమైనంత త్వరగా ఆ కోరికను నెరవేరేలా చేయమని ఆలయాలచుట్టూ తిరుగుతుంటారు. దేవుడిని ప్రతి నిత్యం దర్శించడం ... పూజించడం ... చేస్తుంటారు. తాము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అనేక రకాలుగా ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పుకుంటారు. ఇక ఆ కోరిక నెరవేరకపోతే తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతారు. మనసులేని దేవుడంటూ నిందించి కొంతకాలంపాటు ఆ గుడికి వెళ్లడం మానేస్తారు.

మరో బలమైన కోరిక మనసులోకి ప్రవేశించేంత వరకూ ఈ ప్రహసనం ఇలా కొనసాగుతూనే వుంటుంది. అయితే ఏ కోరిక నెరవేరేలా చేయమని భగవంతుడికి చెప్పుకున్నామో, అది నెరవేర్చాలనే ఆయనా అనుకుంటాడట. అయితే అంతకుముందుగా ఆయన వాళ్ల నడవడికను పరిశీలిస్తాడు. నీతి నియమాలకు కట్టుబడి, ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేవారిని ఆయన అమితంగా అభిమానిస్తాడు.

వాళ్ల కోరికను నెరవేర్చడం వలన, వాళ్లు ఇతరులకి ఎంతవరకూ సాయపడతారనేది ఆలోచిస్తాడు. అసత్యాలు ఆడకపోవడం ... మూగజీవాలను ప్రేమించడం ... నిస్సహాయులను ఆదరించడం వంటి లక్షణాలు కలిగినవారి కోరికలు నెరవేర్చడానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మంచి లక్షణాలు కలిగిన వాళ్లే దేవుడు మనసును గెలుచుకోగలుగుతారు ... ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతారనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles