కలలో పక్షులు కనిపిస్తే ఫలితం ?

కలలో పక్షులు కనిపిస్తే ఫలితం ?
కలలు మనసును ప్రభావితం చేస్తుంటాయి ... ఈ కారణంగానే మంచి కలలు వచ్చినప్పుడు ఉదయాన్నే ఉత్సాహంగా అనిపిస్తుంది. చెడు కలలు వచ్చినప్పుడు మరుసటి ఉదయం ఆందోళనతో గడుస్తుంది. సాధారణంగా ఒక విషయాన్ని గురించి అదేపనిగా ఆలోచిస్తూ వున్నప్పుడు, అందుకు సంబంధించిన కలలు వస్తుంటాయి. అందువలన ఇలాంటి కలలను పరిగణనలోకి తీసుకోకూడదు. మనసులోని ఆలోచనలకు సంబంధంలేని కలవస్తే, అది కూడా తెల్లవారు ఝామున వస్తే ఆ కలలు మాత్రమే నిజమౌతాయని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా కలలో కొండలు ... లోయలు ... ప్రవాహాలు ... జంతువులు ... పక్షులు మొదలైనవి కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా కలలో కనిపించిన తీరును బట్టి ఫలితాలను ఇస్తూ వుంటాయి. పక్షుల విషయానికే వస్తే ... కొన్ని రకాల పక్షులు కనిపించడం వలన సంతోషాలు కలుగుతుంటాయి ... మరికొన్ని పక్షులు కనిపించడం వలన సమస్యలు ఎదురవుతాయి.

'పిచుకలు' ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కనిపించడం వలన కష్టాలు తొలగిపోయి ఆనందాలు దరిచేరతాయి. వాళ్లు ఉత్సాహభరితమైన రోజులు గడుపుతారు. అలాగే 'రామచిలుక' కనిపించడం వలన ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. ఏ వృత్తి చేసే వారికి ఆ వృత్తిలో తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక ఏ వ్యాపారం చేసేవారికైనా ముందుకన్నా ఎక్కువ లాభాలు పొందుతారు.

కలలో 'గరుడపక్షి' కనిపించడం వలన ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కారణంగా జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందడం జరుగుతుంది. కలలో 'కొంగలు' కనిపించడం వలన మానసిక రుగ్మతలు నశించి ప్రశాంతతో కూడిన జీవితం సొంతమవుతుంది. ఇక అందాల 'నెమలి' కలలో కనిపించడం వలన సంపదలు వృద్ధి చెందుతాయి. కలలో నెమలి కనిపించడం త్వరలో జరగనున్న వివాహాన్ని ... త్వరలో కలగనున్న సంతానాన్ని సూచిస్తూ వుంటుంది.

మిగతా పక్షుల వలన ఫలితాలు కాస్త అటు ఇటుగా వున్నా, కలలో 'కాకి' కనిపిస్తే మాత్రం కష్టాలు మొదలవుతాయని గ్రహించాలి. ఆర్ధికంగా ... ఆరోగ్యపరంగా తరుముకొచ్చే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి నిరంతరం చేసే దైవారాధన విరుగుడుగా పనిచేస్తుందనే విషయాన్ని గమనించాలి.

More Bhakti Articles